
సిటీ నెట్వర్క్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసీ విద్యార్థి సంఘం నాయకుడు కవిరాజ్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ, పీవీ నర్సింహరావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీల స్టూడెంట్లు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. నారాయణగూడలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఫొటోకు పాలాభిషేకం చేశారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్‌కట్‌చేశారు. బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని హర్షిస్తూ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెల్లికట్టే విజయకుమార్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి సత్కరించారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ జీఓ జారీ చేయాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ జీఓ జారీ చేయాలన్నారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కులగణన తప్పుల తడక అన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారన్నారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్‌యాదవ్ డిమాండ్ చేశారు. హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు సిద్ధేశ్వర్, ఓయూ జేఏసీ నాయకుడు ఎల్చల దత్తాత్రేయ, జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ మేకల కృష్ణతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. తమిళనాడు తరహాలో షెడ్యూల్9 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంటనే అమలు చేయాలన్నారు.