
తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల ఆమోదించిన రెండు కీలక బిల్లులైన స్థానిక సంస్థలలో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైలురాయి. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల హామీ అయిన కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నట్టుగానే తీసుకువచ్చింది. ఇది ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన దానిని అధికారంలోకి వచ్చిన వెంటనే శాసన రూపంలోకి తీసుకువచ్చి తన నిబద్ధతను చాటుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది.
ఈ చర్యకు బీసీ సంఘాలు చిత్తశుద్ధిగా స్పందించాలి. ఓ రాజకీయ పార్టీ హామీ ఇచ్చినదాన్ని అమలు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో విశ్వాసాన్ని పెంచే అంశం. అభినందించాల్సిన విషయమే. ఈ శాసన ప్రయత్నాలు ఒక్క తెలంగాణకే పరిమితం కావడం లేదు. ఇవి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, ఆర్థిక పురోగతిపై కొనసాగుతున్న చర్చలకు వేదికైంది. తమిళనాడు, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ విషయంలో తీసుకున్న చర్యలు తెలంగాణకు మార్గదర్శకం కానున్నాయి. అయితే, ఈ పరిణామాన్ని లోతుగా విశ్లేషించాలంటే, దాని చరిత్రాత్మక నేపథ్యం, రాజకీయ లక్ష్యాలు, బీసీ సంఘాల స్పందన, దేశవ్యాప్త మార్గదర్శకాలు అన్నీ కలగలిపి చూడాలి.
ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీలు తమ సొంత సామాజిక స్థితిని మెరుగుపరచుకునే అవకాశం పొందగలుగుతారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరగడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెరగడం వల్ల రాజకీయంగా కూడా బీసీలకు పెద్ద స్థాయిలో వాటా దక్కే అవకాశం ఉంది. ఇది బీసీల సంక్షేమానికి ఒక శక్తిమంతమైన మార్గం కావొచ్చు. తమిళనాడు రాష్ట్రం రిజర్వేషన్ విధానంలో భారతదేశంలోనే ముందువరుసలో నిలుస్తుంది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 69 శాతంగా ఉండగా, ఇందులో 50% కంటే ఎక్కువ బీసీలకే కేటాయించారు. ఈ విధానం 1994లో 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయ పరిరక్షణ పొందింది. తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యను ‘సామాజిక న్యాయం’ అనే సిద్ధాంతంతో సమర్థించగా, కోర్టు వివాదాలనుండి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 9వ షెడ్యూల్ రక్షణను పొందడం గమనార్హం. ఇది తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించదగ్గ అంశం. దశాబ్దాలుగా బీసీల రాజకీయ శక్తి, సంఘటీకత, ప్రభుత్వ సంకల్పంతో తమిళనాడులో సాధ్యమైంది. అదే అంశాలు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు పునాది కావాలని న్యాయ కోవిదులు మరియు మేధావులు కోరుతున్నారు.
2023లో బిహార్ ప్రభుత్వం దేశంలో తొలిసారి కుల గణాంక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓబీసీ+ ఈబీసీ జనాభా 63%గా నిర్ధారణ అయింది. ఈ గణాంకాలను ఆధారంగా తీసుకుని సీఎం నితీశ్ కుమార్ బీసీలకు 65% వరకు రిజర్వేషన్లు పెంచే చట్టం తీసుకొచ్చారు. ఈ చర్య రాజ్యాంగ పరిమితి అయిన 50% రిజర్వేషన్ పరిధిని అధిగమించినప్పటికీ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రజల సంక్షేమం, డేటా ఆధారిత అనే ప్రాతిపదికలపై నిలబెట్టింది. ఇది న్యాయపరమైన పునర్విమర్శకు గురవుతుందో లేదో తెలియదుగానీ, ఇది దేశవ్యాప్తంగా రిజర్వేషన్ విధానాలను మళ్లీ చర్చలోకి తీసుకువచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన 42% రిజర్వేషన్ ప్రతిపాదనలు చారిత్రాత్మకమైనవే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో ఉండే కారణంగా తక్షణమే అమలుచేయవచ్చు. దీనిపై కేంద్ర జోక్యం అవసరం లేదు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవి కేంద్ర అంశాలుగా ఉండడం వల్ల, చట్టానికి రాజ్యాంగ ఆమోదం, కేంద్ర సహకారం అవసరమవుతుంది. చట్టబద్ధత కోసం బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న వాదనలున్నా, కేశవానంద భారతి తీర్పు (1973) ప్రకారం పునఃసమీక్షించడానికి కోర్టులకు హక్కు ఉందనేది కొందరి వాదన. ఇదే విషయంలో బీసీ సంఘాలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు బిల్లుల తక్షణ అమలుకు పిలుపునిస్తే, మరికొందరు 9వ షెడ్యూల్ భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఇది సాంకేతికంగా సరైన చర్చ అయినా,
సామాజికంగా ఐక్యత అవసరం.
రాజకీయ ప్రయోజనాల కోణం
బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించాలన్న లక్ష్యంతో వివిధ రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా మాట్లాడుతున్నాయి. ఇది రాజకీయాలలో సహజం. అయితే, ఈ పరిస్థితిలో బీసీలు అప్రమత్తంగా ఉండాలి. పార్టీలు తమ ప్రయోజనాల కోసం బీసీల సమస్యలను ఎత్తి చూపిస్తే, బీసీలు మాత్రం తమ సమస్యలే కేంద్రంగా ఉండేలా చూడాలి. పార్టీల కోసం కాక, తమ హక్కుల కోసం పోరాడాలి. పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీసీలు అనుమతించకూడదు. కానీ బీసీలు మాత్రం అవసరమైతే పార్టీలను తమ ప్రయోజన సాధనానికి ఓ సాధనంగా మలుచుకోవచ్చు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ధర్నాను కొన్ని బీసీ సంఘాలు సమర్థించగా, మరికొన్ని సంఘాలు దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకే చేయబడిన చర్యగా విమర్శించాయి. ఇదే అసలు చిక్కు. బీసీ రిజర్వేషన్ అనే సామూహిక హక్కుపై పోరాటం జరుగుతున్న వేళ బీసీ సంఘాల మధ్య విభేదాలు సామాజిక ఐక్యతను బలహీనపరుస్తాయి. ఒకే లక్ష్యానికి గల సామాజిక వర్గం ఒకే స్వరంతో మాట్లాడకపోతే, ప్రభుత్వాలు ఆ ఐక్యతలేమిని దుర్వినియోగం చేయవచ్చు. కావున, బీసీ సంఘాలు వాదనలలో విభిన్నతను పక్కనపెట్టి బీసీల ప్రగతిని కేంద్రంగా చేసుకొని చర్చల్లో పాలుపంచుకోవాలి. బీసీలకు న్యాయం చేయాలంటే రాజకీయ పార్టీల చిత్తశుద్ధి అవసరం. శాసనసభలో బిల్లును ఆమోదించిన నేతలు రిజర్వేషన్ అమలు అయ్యేవరకు అండగా నిలవాలి. చట్టబద్ధతతో కోర్టుల్లో నిలబెట్టగలిగే న్యాయవాద పరిజ్ఞానం అవసరం. ఈ మూడు బలాల ద్వారా బీసీలు తమ హక్కులను పొందగలుగుతారు. పార్టీలకు విధేయత చూపడం కాదు, పార్టీలను బీసీ హక్కుల సాధనంగా ఉపయోగించుకోవడమే నిజమైన విజ్ఞత. రాజకీయాలు చేయడం కన్నా, న్యాయం సాధించడం గొప్పది. అదే బీసీలకు లభించే దిశగా ఉండాలి. తెలంగాణలో 42% రిజర్వేషన్ పట్ల స్పందనలు రాజకీయ, సామాజిక కోణాల్లో విభిన్నంగా ఉన్నా, మౌలిక లక్ష్యం ఒక్కటే. తమిళనాడు మాదిరి దీర్ఘకాలిక దృక్పథం, బిహార్ మాదిరి డేటా ఆధారిత సమర్థన, వీటిద్వారానే తెలంగాణ ముందుకెళ్లాలి. రాజకీయంగా కాక, సామాజిక న్యాయపరంగా చూడడమే అసలు విజయం అవుతుంది.
చట్టపరమైన అడ్డంకులు అధిగమించాలంటే..!
రిజర్వేషన్ల మార్గంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 50% రిజర్వేషన్ పరిమితి, 9వ షెడ్యూల్ చేర్పు చట్టబద్ధత, కోర్టుల జోక్యం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారవచ్చు. ఇవి రాజకీయ నినాదాల ద్వారా పరిష్కారమయ్యేవి కావు. దశాబ్దాల న్యాయ అనుభవంగల కోవిదుల సలహాలు తీసుకొని చట్టపరంగా బలమైన పునాదులు ఏర్పరచుకోవాలి. అప్పుడే రిజర్వేషన్లు దీర్ఘకాలంగా నిలిచే అవకాశం ఉంటుంది.
- యర్రమాద వెంకన్న నేత