చట్టపరంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలి

 చట్టపరంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలి
  • రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా కాదు.. చట్టప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 

బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్​అధ్యక్షతన 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ నుంచి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు న్యాయం జరగదన్నారు. అన్ని పార్టీలు ముందుకొచ్చినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. 

అగ్రకులాల అభ్యర్థులతో, డబ్బుతో బీసీలు పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. అప్పుడు అన్ని పార్టీలు బీసీలకు సమాన అవకాశాలు  ఇస్తాయన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.