
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పూణె సిటీలోని షానిపర్ ప్రాంతంలోని బాలిక పీజీ వసతి గృహంలో 2024, జూన్ 6వ తేదీ రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో వాచ్‌మెన్ సజీవదహనమైనట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ భవనంలోని మొదటి అంతస్తులో, బాలికలు పీజీ వసతి గృహం ఉన్న రెండవ అంతస్తులో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయని పోలీసులు చెప్పారు. దాదాపు 45 నిమిషాలపాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారి తెలిపారు.
గర్ల్స్ పీజీ హాస్టల్ లో ఉన్న 42 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే, భవనంలో కింది అంతస్తులో నిద్రిస్తున్న వాచ్‌మెన్ మంటల్లో కాలి బూడిదయ్యాడని తెలిపారు. వాచ్‌మెన్ కాలిపోయిన మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.