- భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం
జూలూరుపాడు, వెలుగు : మంత్రాలు, చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని రాచబండ్ల కోయగూడెం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన కుంజా భిక్షం (42) చేతబడి చేస్తున్నాడని అతడి బంధువులైన కుంజా ప్రవీణ్, గంగయ్య అనుమానం పెంచుకున్నారు.
ఈ క్రమంలో భిక్షంను ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేసి, డెడ్‌బాడీని చెక్‌డ్యాంలో పడేశారు. తర్వాత ఇద్దరూ పోలీసులకు లొంగిపోయారు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణాప్రతాప్ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి సోమవారం చెక్‌డ్యాం వద్దకు చేరుకొని భిక్షం డెడ్‌బాడీని బయటకు తీశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.