ఉగాండా క్రికెట్‌కి గురువారం(జూన్ 6) చారిత్రాత్మకమైన రోజు. వారు పపువా న్యూ గినియాను ఓడించి టీ20 ప్రపంచ కప్ 2024లో తొలి విజయాన్ని అందుకున్నారు. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఉగాండా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత న్యూ గినియాను 77 పరుగులకే కట్టడి చేసి.. అనంతరం లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
43 ఏళ్ల వయస్సులో అరంగ్రేటం
సాధారణంగా ఏ ఆటగాడైనా పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ, ఫ్రాంక్ సుబుగా రూటే వేరు. లేటు వయస్సులో ఎంట్రీ ఇచ్చాడు. 43 ఏళ్ల వయస్సులో ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసి చూపించాడు.
4 ఓవర్లలో 4 పరుగులు
ఆఫ్ స్పిన్నరైన సుబుగా న్యూ గినియాపై తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులిచ్చి రెండు వికెట్లు (4-2-4-2) పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్లు కూడానూ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే బెస్ట్ ఎకానమీ (1.00) బౌలింగ్. కొన్నిరోజుల క్రితం ఇదే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేసర్ బార్ట్‌మన్ (2.25) చేసిన బెస్ట్ బౌలింగ్ ఎకానమీని సుబుగా అధిగమించాడు.
రియాజత్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌటైంది. ఉగాండా బౌలర్లలో సుబుగా 2, అల్పేష్ 2, కోస్మస్ 2, జుమా 2, మసాబా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 78 పరుగుల టార్గెట్‌ను ఉగాండా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాజత్ (33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. పపువా న్యూగినియా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఉగాండా ఆరంభంలో ఇబ్బంది పడింది. చివరికి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.