- 5వ టౌన్ ఎదుట బైఠాయించిన బాధితులు
- బోగస్ పట్టాలు, తప్పుడు రిజిస్ట్ర్రేషన్తో అంటగట్టిన నలుగురు కార్పొరేటర్లు
- నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు దిగిన ఆఫీసర్లు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగర శివారులోని నాగారం భారతీనగర్ కాలనీ బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేతలతో 44 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్డీవో రాజేంద్రకుమార్, కార్పొరేషన్ ఆఫీసర్లు వందలాది పోలీస్ బందోబస్తుతో వచ్చి రెండు పొక్లెయినర్లతో కట్టడాలను నేలమట్టం చేశారు. శిఖం పక్కనే ఉన్న సర్వే నంబర్ 2142 ల్యాండ్‌ను ఆధారం చేసుకొని 13 ఏండ్ల నుంచి పొలిటికల్ పార్టీల నేతలు ప్లాట్ల దందా సాగించారు. ప్రస్తుత పాలకవర్గంలోని నలుగురు కార్పొరేటర్ల అండతో వారికి రూ.లక్షల ఆదాయం సమకూరింది.
స్లమ్ ఏరియాలో జీపీఏతో మోసం
నాగారం ఏరియా అంతా దాదాపు గుట్టలతో నిండి ఉంటుంది. 9, 10, 11 డివిజన్లలో విస్తరించిన కాలనీలో గత ప్రభుత్వాలు వేలాది మందికి ఇంటి స్థలాలు ఇవ్వగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో అక్కడక్కడ ఉన్న పట్టాల్యాండ్స్ను ఓనర్లు ప్లాట్ల కింద విక్రయించారు. ఈ రకంగా బొందం గడ్డ చెరువును ఆనుకొని ఎకరం విస్తీర్ణంలో ఉన్న పట్టా ల్యాండ్ మాటున శిఖంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కమార్కులు చిన్నచిన్న బిజినెస్‌లు చేసుకునే వారికి 100 , 120, 180 గజాల ఇండ్ల ప్లాట్లుగా విక్రయించారు. రూ.1.50 లక్షల నుంచి రూ.5.0 లక్షల దాకా డబ్బులు తీసుకున్నారు.
సుంకటి మదుసూదన్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోదాలో శేక్ అమ్జద్ అనే వ్యక్తి కొనుగోలుదార్లకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. రిజిస్రేషన్ కానీ కొన్ని స్థలాలకు గవర్నమెంట్ పట్టాలు సృష్టించి మరీ విక్రయించారు. ఈ తతంగమంతా నలుగురు లీడర్ల కనుసన్నల్లో నడిచింది. సదరు స్థలాలలో పక్కా బిల్డింగ్లు నిర్మించుకున్న కుటుంబాలు కరెంట్ కనెక్షన్లు పొంది క్రమంగా బిల్స్ చెల్లిస్తున్నారు. 12 ఏండ్ల నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌కు హౌస్ ట్యాక్స్‌లు కడుతున్నారు.
తప్పు ఎవరిది..?
పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు, టీస్టాల్స్ నిర్వహించే వ్యక్తులు ఒకరిని చూసి మరొకరు ఈ ప్లాట్స్ కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇళ్లు నిర్మించుకుంటే అసెస్మెంట్ నంబర్ ఎలాట్ చేయడంతో పాటు ట్యాక్స్‌లు వసూలు చేస్తుండడంతో కొనుగోలు చేస్తున్న ప్లాట్లు నిజమైనవేనని నమ్మారు. కాలనీలో కరెంటు పోల్స్ వేయడం ఇండ్లకు కనెక్షన్లు కూడా ఇవ్వడంతో భరోసా ఏర్పడింది.
మొదటి నుంచి వాటిని అనుమతించకుంటే ప్లాట్లను ఎవరూ కొనేవారుకాదు. అయితే సదరు ఇండ్లు చెరువు శిఖంలో ఉన్నాయంటూ శనివారం పొద్దున ఆర్డీవో రాజేంద్రకుమార్, మున్సిపల్ కార్పొరేషన్ టీంతో కాలనీలోకి ప్రవేశించి పోలీస్ బందోబస్త్ మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం కూడా వీటిని కొనసాగించారు. అనూహ్య పరిణామానికి బిత్తరపోయిన బాధిత కుటుంబాలు ఆదివారం బయటకు వచ్చి డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్ నేతృత్వంలో 5వ టౌన్ ఎదుట భైఠాయించారు. నీడ కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలకు సమీపవాసులు భోజన వసతి కల్పిస్తున్నారు.
కలలో కూడా అనుకోలేదు
2011లో వంద గజాల స్థలాన్ని కొనుగోలు చేసి 2013లో పక్కా ఇళ్లు కట్టుకొని కుటుంబమంతా ఆశ్రయం పొందుతున్నం. పట్టా భూమిలో వెంచర్ వేశామనడంతో నమ్మినం. ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇంటి ట్యాక్స్, కరెంట్ బిల్లు కడుతున్నం. కాగా సడెన్ గా పోలీసులతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయక కూల్చివేతలు చేపట్టారు.3
తాహెరా బేగం