- సీఎంకు వివరించిన అధికారులు
- సర్వేకు ఆటంకం కలిగిస్తే చర్యలు: సీఎం
- నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఉపేక్షించవద్దని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయం లోపు సర్వే పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమగ్ర సర్వేపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 51,24 ,542 ఇండ్లలో (44.1 శాతం) సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఇందులో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని.. 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించామన్నారు. 52,493 గ్రామీణ.. 40,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 93,394 బ్లాకులుగా విభజించి సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. సర్వేపై ప్రజల నుంచి స్పందన బాగుందని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. సర్వే జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఇప్పటికే మార్కింగ్ చేసిన 1.16 కోట్ల ఇండ్లలో ఒక్కటి కూడా వదలకుండా సర్వే పూర్తి చేయాలని చెప్పారు.
‘‘రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే నిర్వహిస్తున్నాం. సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సమాచారం అందుతున్నది. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.