కృష్ణా బోర్డుకు 446 మంది ఏపీ స్టాఫ్​

  • ప్రాజెక్టుల ఆర్గనైజేషన్​ స్ట్రక్చర్​కు ఆంధ్రా సర్కార్​ ఓకే

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈనెల 9న నిర్వహించిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఎమర్జెన్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా ప్రాజెక్టుల ఆర్గనైజేషనల్, పార్షియల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ప్రతిపాదనను కృష్ణా బోర్డుకు పంపింది. 85 మంది ఇంజనీర్లు సహా 446 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి ఇవ్వడానికి ఓకే చెప్పింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ సహా ఏపీ భూభాగంలోని పలు ఔట్ లెట్ల నియంత్రణను బోర్డు పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లోని షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టుల ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ నిర్వహణకు 446 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి తేవడానికి ఏపీ ఓకే చెప్పింది. ఒక ఎస్ఈ, ఈఈలు ఐదుగురు, డీఈఈలు 17 మంది, ఏఈఈలు 62 మంది, సర్కిల్ స్కేల్ ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్ సర్కిల్ సిబ్బంది 33 మంది, నాన్ టెక్నికల్ స్టాఫ్ 156 మంది, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది 24 మంది, వర్క్ చార్జ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్ 148 మందిని బోర్డు అధీనంలోకి తీసుకురానున్నారు. ఏపీ కోరినట్టు కేంద్రం మినహాయింపులు ఇస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమల్లోకి రానుంది.

పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రతిపాదన ఇలా..

  • శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ లు, డ్యామ్ మెయింటనెన్స్ కు సంబంధించిన ఐదు ఈస్ట్ సర్కిళ్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ను బోర్డు అధీనంలోకి ఇవ్వడానికి ఏపీ ఓకే చెప్పింది.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మూడు సబ్ డివిజన్లు, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాలువ పరిధిలోని 16, 17 బ్రాచ్ కెనాళ్ల ఆఫ్ టేక్ లు, ఎడమ కాలువ 154.59 కి.మీ.ల పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు, ఎడమ కాలువ పరిధిలోని మంగాపురం మేజర్ ఆఫ్ టేక్ లు, ఎడమ కాలువ పరిధిలోని బోనకల్ ఆఫ్ టేక్ లు, మధిర బ్రాంచ్ కెనాల్ ఆఫ్ టేక్ లు, తిరువూరు ఆఫ్ టేక్ లు, ఏపీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– తెలంగాణ బోర్డర్ లోని కాలువను బోర్డు అధీనంలోకి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది.
  • తుంగభద్ర బోర్డు ప్రత్యేకంగా ఉన్నందున తుంగభద్ర రైట్ మెయిన్ కెనాల్, హైలెవల్ కెనాల్, కెనాల్ నెట్ వర్క్ ను గెజిట్ లోని షెడ్యూల్ – 2 పరిధి నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసింది.
  • పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ లు, ఈ ప్రాజెక్టు పరిధిలోని రెండు సబ్ డివిజన్లను బోర్డుకు అప్పగించడానికి అంగీకారం తెలిపింది.
  • వెలిగొండ ప్రాజెక్టు ఇంకా ఆపరేషన్ లోకి రాలేదని, రాగానే హెడ్ రెగ్యులేటర్ ను నియంత్రించే అధికారం బోర్డుకు అప్పగించడానికి సిద్ధమని పేర్కొంది.
  • పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని, అందుకే దీనిని గెజిట్ నుంచి తొలగించాలని కోరింది.