పోడు పట్టాలు కొందరికే

  • నిజామాబాద్ లో 15,050 అప్లికేషన్లలో 846 ఎలిజిబిలిటీ
  • కామారెడ్డి జిల్లాలో 27,075 అప్లికేషన్లలో 4,480 సెలక్ట్​

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు:ఏళ్ల తరబడి పోడు పట్టాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లావాసులను బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉసూరుమనిపించింది. నిజామాబాద్​ జిల్లాలో అర్జీలు పెట్టుకున్నవారిలో కేవలం 5 శాతం, కామారెడ్డి జిల్లాలో 16 శాతం మందికి మాత్రమే పట్టాలు లభించనున్నాయి.

వచ్చే నెలాఖరు నుంచి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అర్హులైన లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. ఉమ్మడి జిల్లాలో పోడు పట్టాల కోసం ఎస్టీలు, ఇతరుల నుంచి భారీగా అప్లికేషన్లు రాగా, నామమాత్రంగానే లబ్ధిదారులను ఎంపిక చేశారు.  గిరిజనేతరులకు సంబంధించి ఒక్క అర్జీని కూడా సెలక్ట్​ చేయలేదు.

నిజామాబాద్​జిల్లాలో..

నిజామాబాద్​ జిల్లాలో పోడు పట్టాల కోసం గిరిజనుల నుంచి 8620, గిరిజనేతరుల నుంచి 6430 దరఖాస్తులు అందాయి. మొత్తంగా15,050 ఆర్జీలు వచ్చాయి. సాగుకు ఉపయోగపడే అటవీ భూమి 34,225 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వడపోతల అనంతరం పట్టాలు పొందే అర్హుల లెక్కను అధికారులు తేల్చారు. కమిటీల క్షేత్ర నివేదికలు, అధికారులు ప్రమాణికం చేసుకున్న టెక్నికల్​అంశాలకు పోలిక లేకుండా తుది జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 15,050 దరఖాస్తుల నుంచి కేవలం 846 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. గిరిజనేతరులు అటవీభూమిని సాగుచేస్తున్నట్లయితే అందుకు సంబంధించి 70 ఏళ్ల రికార్డు చూపాలని నిబంధన విధించారు.  ఇది ఎక్కడి నుంచి పొందాలో మాత్రం చెప్పలేదు. దీంతో గిరిజనేతరుల నుంచి అందిన 6430 దరఖాస్తుల్లో ఒక్కటీ ఆమోదం పొందలేదు.

కామారెడ్డిలో..

జిల్లాలో 395 గ్రామాల్లో పోడు అగ్రికల్చర్​ఉంది. పట్టాల కోసం మొత్తం 27,075 దరఖాస్తులు వచ్చాయి.  68 వేల ఎకరాల సాగు భూమి ఉంది. 11,365 మంది ఎస్టీల నుంచి , 15,710 ఇతరుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గ్రామ, డివిజన్​ కమిటీల్లో అప్లికేషన్లు పరిశీలించి జిల్లా కమిటీకి పంపారు. ఇందులో నుంచి 4,480 మంది గిరిజన లబ్ధిదారులకు 12,969 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్టీల్లో కొందరికి అర్హత లేదని అప్లికేషన్లు తిరస్కరించారు. గిరిజనేతరుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆమోదించలేదు.