నెట్ వాడకంలో పట్నంతో పోలిస్తే పల్లెల్లోనే 20%  ఎక్కువ

నెట్ వాడకంలో పట్నంతో పోలిస్తే పల్లెల్లోనే  20%  ఎక్కువ
  • పట్నంతో పోలిస్తే పల్లెల్లోనే 20%  ఎక్కువ యూజర్లు
  • గ్రామాల్లో నెట్​ వాడుతున్నోళ్లు 35.2 కోట్లు
  • నగరాల్లో 29.4 కోట్ల మంది వాడకం
  • దేశంలో మొత్తం నెట్​ యూజర్ల సంఖ్య 64.6 కోట్లు
  • రెండేండ్లలో 60% వృద్ధి
  • మొత్తం యూజర్లలో మహిళలే 60%
  • నెట్​ వాడకంపై ‘భారత్​ 2.0’ పేరిట నీల్సన్​ సర్వే
  • దేశంలో మొత్తం నెట్​ యూజర్లు  64.6 
  • రెండేండ్లలో పల్లె యూజర్లలో వృద్ధి  45%
  • మహిళా యూజర్లలో పల్లెలకు చెందినోళ్లు  33%
  • రెండేండ్లలో పెరిగిన మహిళా యూజర్లు 61%
  • 50 ఏండ్లు నిండిన గ్రూపులో యూజర్లు 81%
  • 12 ఏండ్లు పైబడి నెట్​ వాడుతున్నోళ్లు 59.2 

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఊర్లల్ల ఇంటర్నెట్​ వాడకం పెరిగిపోయింది. పట్నం జనాలతో పోలిస్తే పల్లె ప్రజలే ఎక్కువగా వాడుతున్నారు. సిటీల్లో 29.4 కోట్ల మంది నెట్​యూజర్లుండగా.. పల్లెల్లో ఆ సంఖ్య 35.2 కోట్లుగా ఉంది. అంటే పట్నంతో పోలిస్తే పల్లెల్లో ఇంటర్నెట్​ వాడకం 20 శాతం ఎక్కువగా ఉండడం విశేషం. ‘భారత్​ 2.0 ఇంటర్నెట్​ స్టడీ’ పేరుతో నీల్సన్​ అనే ఇంటర్నేషనల్​ కంపెనీ నిరుడు సెప్టెంబర్​ నుంచి డిసెంబర్​ మధ్య చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 27,900 కుటుంబాల్లోని 1.10 లక్షల మందిని సర్వే చేశారు. 2019 నుంచి రెండేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ వాడే వారి సంఖ్య 45 శాతం పెరిగినా.. ఇంకా 60 శాతం మందికి ఆ సేవలు అందట్లేదని ఆ సర్వే తేల్చింది. నగరవాసుల్లో 59 శాతం మంది నెట్​ వాడుతుండగా.. రెండేండ్లలో 28 శాతం వృద్ధి నమోదైనట్టు సర్వేలో వెల్లడైంది. 

దేశంలో ఇంటర్నెట్​ వాడుతున్న వారి సంఖ్య 64.6 కోట్లు. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 60% పెరిగింది. 12 ఏండ్లు నిండిన వాళ్లలో 59.2 కోట్ల మంది ఇంటర్నెట్​ వాడేస్తున్నారు. రెండేండ్లలో ఆ సంఖ్య 37% పెరిగింది. ఇక ఇంటర్నెట్​ వాడుతున్నోళ్లలో 60% మంది మహిళలే ఉన్నారు. రెండేండ్లలోనే మహిళా వినియోగదారులు 61% పెరిగారు. నెట్​ వాడుతున్న మగవారిలో 28% వృద్ధి మాత్రమే నమోదైంది. నెట్​ వాడుతున్న మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు (33%) పల్లెలకు చెందినోళ్లే. ఇటు 50 ఏండ్లు నిండిన యూజర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆ ఏజ్​ గ్రూప్​లోని 81 శాతం మంది నెట్​ వాడుతున్నారు.  

సోషల్​ మీడియా.. షాపింగ్​ కోసమే ఎక్కువ

ప్రస్తుతం సోషల్​ మీడియా అకౌంట్​ లేని యూజర్లుండడం చాలా తక్కువ. ఏ కొద్దిపాటి సమయం దొరికినా సోషల్​ మీడియాలో దోస్తులతో బాతాఖానీ కొట్టేస్తూ టైం పాస్​ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్​ వాడకంలో సోషల్​ మీడియా వినియోగమే ఎక్కువగా ఉన్నట్టు నీల్సన్​ సర్వేలో తేలింది. 50.03 కోట్ల మంది కేవలం సోషల్​ మీడియా, ఆన్​లైన్​ వీడియోలు, మ్యూజిక్​ కోసమే ఇంటర్నెట్​ను వాడుతున్నారు. ఆన్​లైన్​ వీడియోలు చూస్తున్న 44 కోట్ల మంది యూజర్లలో 54% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారు. ఆ తర్వాత ఆన్​లైన్​ షాపింగ్​ కోసం నెట్​ను వాడుతున్నారు. ఈ విషయంలో పట్టణ జనాలే ముందున్నారు. అందులోనూ 47% మంది కొత్తవాళ్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​, ఆన్​లైన్​ పేమెంట్ల కోసం నెట్​ను వాడుతున్న వారి సంఖ్య ఎక్కువుంది. అందులో 66% మంది 20 నుంచి 39 ఏండ్ల మధ్య వాళ్లే ఉన్నారు. ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​ చెల్లింపులు చేస్తున్నోళ్లలో గ్రామీణ ప్రాంతాల వారి సంఖ్య 46%. ఆన్​లైన్​ బ్యాంకింగ్​ చేస్తున్న వారిలో మగవాళ్లే ఎక్కువ. 100లో 69 మంది పురుషులు ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​ చెల్లింపుల సేవలను వాడుకుంటుంటే.. ఆడవాళ్ల సంఖ్య 31గా ఉంది. 

కారణమిదే..

ఇప్పుడంతా స్మార్ట్​ఫోన్ల యుగమైపోయింది. తక్కువధరకే బడ్జెట్​ఫోన్లు వస్తుండడం, టెలికాం ఆపరేటర్లు తక్కువ ధరకే నెట్​ సేవలను అందిస్తుండడంతో చాలా మందికి అది చేరువైపోయింది. దానికి తోడు గ్రామీణులకు నెట్​ సేవలను దగ్గర చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్​ నెట్​’ పేరుతో స్కీమును ప్రవేశపెట్టడం, ‘డిజిటల్​’ సర్వీసులకు శ్రీకారం చుట్టడం, రాష్ట్రాల ప్రభుత్వాలూ ఆ దిశగా చర్యలు తీసుకుంటుండడం వల్ల నెట్​ వాడకం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.