- పోలీసుల తనిఖీల్లోభారీగా దొరుకుతున్న నగదు
- సూర్యాపేట జిల్లా చిలుకూరులో రూ.45 లక్షలు స్వాధీనం
సూర్యాపేట, కోదాడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, వెలుగు : పోలీసుల తనిఖీల్లో డబ్బులు భారీగా పట్టుబడుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలో నాలుగు ఘటనల్లో రూ. 49.50 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా అదే స్థాయిలో నగదు దొరికింది. సూర్యాపేట జిల్లా చిలుకూరులో హుజూర్‌నగర్ –మిర్యాలగూడ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కోదాడ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఉద్యోగి చీరాల సాయికుమార్ రూ. 45 లక్షలతో పట్టుపడ్డారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని విచారణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారు.
అలాగే కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్ చెక్‌పోస్ట్ వద్ద నాగారం మండలం ఈటూరుకు చెందిన చేపల వ్యాపారి నర్ల నరేశ్ కుమార్ మారుతి సుజుకి వాహనంలో పడవలు కొనేందుకు రూ. 1.50 లక్షల తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. మరో ఘటనలో నాగపూర్‌కు చెందిన అతావుల్లా ఖాన్ గ్రానైట్ కొనేందుకు ప్రకాశం జిల్లా మార్టూరుకు రూ. 1.96 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. తమ్మర స్టేజీ వద్ద హుజూర్‌నగర్ మండలం కరక్కాయల గూడేనికి చెందిన ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావు తన కారులో రూ. 7.30 లక్షలు తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకొని ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పజెప్పారు.
సూర్యాపేట మండలంలోని టేకుమట్ల జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో తరలిస్తున్న రూ.3.58 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నాగార్జునసాగర్ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఏపీలోని మాచర్ల కు చెందిన అరుణ్ కుమార్ బైక్‌పై రూ.1.42 లక్షలతో నల్గొండ జిల్లా పైలాన్ కాలనీకి వస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు. కొండమల్లేపల్లి పీఎస్ పికెటింగ్ వద్ద కారులో హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద రూ. 88 వేలు, మరో వ్యక్తి వద్ద 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లిలో హైదరాబాద్ నుంచి చింతపల్లికి వస్తున్న కారులో రూ. 1.34 లక్షలు పట్టుబడగా సీజ్ చేశారు.