హయత్​నగర్​ నుంచి 45 ఎలక్ట్రిక్​బస్సులు.. మరో వారం రోజుల్లో ప్రారంభం

హయత్​నగర్​ నుంచి 45 ఎలక్ట్రిక్​బస్సులు.. మరో వారం రోజుల్లో ప్రారంభం
  • ఏప్రిల్​ నెలలో గ్రేటర్​లోకి  మరో 250 బస్సులు 
  • వచ్చే ఏడాది నాటికి అన్ని  ఎలక్ట్రిక్​బస్సులే

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో కాలుష్య నివారణ కోసం  ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశ పెడుతున్న ఆర్టీసీ  మరో వారంలో హయత్​నగర్​ డిపో నుంచి 45 ఎలక్ట్రిక్​బస్సులను నడిపేందుకు రెడీ అయింది.  హయత్​ నగర్​నుంచి మెహదీపట్నం, హైటెక్​ ​సిటీ, కొండాపూర్​, మియాపూర్, చందానగర్, పటాన్​చెరు వరకూ  ఈ –బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ లో మరో 250 ఎలక్ట్రిక్​ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, వీటిని నగరంలోని ప్రధాన రూట్లలో నడుపుతామని అధికారులు చెబుతున్నారు.  గ్రేటర్​లో ప్రస్తుతం అన్ని రకాలవి కలిపి 2800 బస్సులను నడుపుతుండగా, ఇందులో 200 ఎలక్ట్రిక్​ బస్సులున్నాయి. వచ్చే ఏడాది నాటికి నగరమంతా ఎలక్ట్రిక్​ బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

లాంగ్​ రూట్లకు ఎక్కువ ప్రాధాన్యం

ప్రస్తుతం ఔటర్​రింగ్​రోడ్​ పరిధిలోని ప్రజలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రెండు మూడు బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఒకే బస్సులో గమ్యాన్ని చేరుకునేందుకు వివిధ రూట్లలో ఎలక్ట్రిక్​ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఘట్​కేసర్​– మెహదీపట్నం, తుక్కుగూడ– కొండాపూర్​, హయాత్​నగర్​–పటాన్​చెరు, కొండాపూర్​–ఈసీఐఎల్​, ఈసీఐఎల్​–మెహదీపట్నం, ఉప్పల్​–నానక్​రామ్​గూడ వంటి లాంగ్​రూట్లలో ఎక్కువ బస్సులను నడపాలని నిర్ణయించింది. 

ఓఆర్ఆర్​పరిధిలోని అన్ని గ్రామాలు, కాలనీలకు సైతం వివిధ ఎలక్ట్రిక్​, ఏసీ, ఎక్స్​ప్రెస్​, డీలక్స్​ సర్వీసులను నడపడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించింది.