
- కేసీఆర్పై 45 మంది ‘ధరణి’ బాధితుల పోటీ
- గజ్వేల్లో నామినేషన్ల దాఖలు
- అందరూ రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లు కోల్పోయినవారే..
- శుక్రవారం నామినేషన్ వేయనున్న మరో 50 మంది
గజ్వేల్, వెలుగు : రంగారెడ్డి జిల్లాకు చెందిన 45 మంది ‘ధరణి’ పోర్టల్ బాధితులు సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమయ్యారు. గురువారం గజ్వేల్లో నామినేషన్లు వేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. 1980లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని 30 సర్వే నంబర్ల పరిధిలో 460 ఎకరాలను 3 వేల ప్లాట్లుగా మార్చి విక్రయించారని చెప్పారు. వాటిని తమలాంటి ఎంతోమంది చిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలు కొన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ వచ్చాక 460 ఎకరాలు1980 నాటి పట్టాదారులపైనే ఉన్నట్లు చూపిస్తోందన్నారు. ధరణితో తమకు అన్యాయం జరిగిందని, పోర్టల్లో సరిచేయాలని ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.
వేల మంది తమ ప్లాట్లను కోల్పోయారని చెప్పారు. శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఐక్యంగా పోరాటం చేస్తున్నామని వివరించారు. తమతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారని, భూములు కోల్పోయారని, జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిసేలా చేసేందుకే కేసీఆర్పై పోటీ చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం మరో 50 మంది నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు.