సగం జీవితం కటకటాల్లోనే.. బాలికలపై లైంగికదాడులు చేసిన ఇద్దరికి కఠిన శిక్షలు

సగం జీవితం కటకటాల్లోనే..  బాలికలపై లైంగికదాడులు చేసిన ఇద్దరికి కఠిన శిక్షలు
  • మైనర్​పై అఘాయిత్యం చేసిన కార్పెంటర్​కు 25 ఏండ్ల జైలు  
  • దోస్తు బిడ్డపై అత్యాచారం చేసిన మరొకరికి 15 ఏండ్ల జైలు 

మెహిదీపట్నం/ఎల్బీనగర్, వెలుగు:బాలికలపై లైంగికదాడి చేసిన ఇద్దరు నేరస్తులకు శుక్రవారం కోర్టులు కఠిన శిక్షలు విధించాయి. ఎవరైనా నేరం చేసేముందు మరొక్కసారి ఆలోచించేలా తగిన శాస్తి చేశాయి. నేరస్తుల్లో ఒకరికి నాంపల్లి సెషన్స్​కోర్టు 25 ఏండ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వగా, మరో కేసులో దోషికి15 ఏండ్ల కారాగారం విధిస్తూ  రంగారెడ్డి జిల్లా ఫాస్ట్​ట్రాక్ కోర్టు జడ్జిమెంట్​ఇచ్చింది.  

44 ఏండ్లొచ్చినా... 

సీతారాంబాగ్ ఓల్డ్ మల్లేపల్లికి మెతుకరి సత్యనారాయణ చారి అలియాస్ చిన్న వయస్సు 44 ఏండ్లు..ఇతడు కార్పెంటర్ గా పని చేసేవాడు. 2022లో ఓ బాలికను లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బేగంబజార్​పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు రిజిస్టర్​చేశారు. అయితే, ఘటన జరిగింది మంగళహాట్ పీఎస్​లో పరిధిలో కావడంతో అక్కడికి బదిలీ చేశారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్​ఎవిడెన్స్​తో సహా పక్కా ఆధారాలతో 12వ అడిషనల్ నాంపల్లి సెషన్స్ కోర్టులో చార్జిషీట్​దాఖలు చేశారు. 

2022లో మొదలైన కోర్టు విచారణ దాదాపు మూడేండ్ల పాటు కొనసాగింది. ఇరువర్గాల వాదనలు విని, సాక్ష్యాలు పరిశీలించిన జడ్జి నిందితుడిని దోషిగా పరిగణిస్తూ 25 ఏండ్ల జైలుతో పాటు రూ.15 వేల జరిమానా విధించారని సీఐ మహేశ్ తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో శిక్షా కాలాన్ని పొడిగిస్తూ తీర్పు చెప్పారు. 

స్నేహితుడిని నమ్మి అప్పగిస్తే...

తన ఆరోగ్యం బాగోలేదని దోస్తును నమ్మి, బిడ్డ బాధ్యతలు అప్పగిస్తే ఆమెపై లైంగికదాడి చేయడంతో కోర్టు అతడికి పదేండ్ల జైలు శిక్ష వేసింది. పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలోని బాలాపూర్​షాహిన్ నగర్​కు చెందిన వ్యక్తికి 15 ఏండ్ల కూతురు ఉంది. అతడి ఆరోగ్యం బాగా లేకపోవడం, తల్లి లేకపోవడంతో బిడ్డ బాధ్యతను తాత్కాలికంగా చూసుకోవడానికి తన స్నేహితుడైన సయ్యద్ హజీ అలీ(43)కి 2021లో అప్పజెప్పాడు. దీంతో బాలికపై కన్నేసిన హజీ ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. 

విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పగా, పహడీ షరీఫ్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్​కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఫాస్ట్​ట్రాక్ కోర్టులో చార్జిషీట్​దాఖలు చేయగా, ఆధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.