ప్రజావాణిలో దరఖాస్తు పెట్టాడు.. 46 ఏళ్ల సమస్య పరిష్కారమైంది..

ప్రజావాణిలో దరఖాస్తు పెట్టాడు.. 46 ఏళ్ల సమస్య పరిష్కారమైంది..
  • పట్టాదార్​ పాస్​ పుస్తకం కోసం 46 ఏళ్ల నిరీక్షణ...
  •  100 రోజుల్లో ప్రజావాణిలో పరిష్కారం

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 1031 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వాటిలో మైనారిటీ వెల్ఫేర్​కు 580,పంచాయతీ రాజ్​ గ్రామీణ అభివృద్ధికి 172,విద్యుత్​ వాఖకు చెందినవి 81, ప్రవాసీ ప్రజావాణికి 02, ఇతర శాఖలకు   196 దరఖాస్తులు అందాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్​ చిన్నారెడ్డి పర్య వేక్షణలో నోడల్​ అధికారి దివ్య దేవరాజన్​ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 

పట్టాదార్​ పాస్​ బుక్​ కోసం 46 ఏళ్ల నిరీక్షణ ...

 పట్టాదార్​ పాస్​ పుస్తకం కోసం 46 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాలేదని .. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే 100 రోజుల్లోనే పాస్​ బుక్​ వచ్చిందని కొమ్మన బోయిన పిచ్చయ్య ఆనందం వ్యక్తం చేశాడు. నల్గొండ జిల్లా నకిరేకల్​ నియోజక వర్గం కట్టంగూర్​ మండలం ఎర్రసాని గూడెం గ్రామానికి చెందిన కొమ్మన బోయిన పిచ్చయ్యకు సర్వే నంబరు 215/3 ఒక ఎకరం భూమి ఉంది. 

1978 నుంచి దానికి పాస్​ బుక్​కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు.అయినా ఫలితం దక్కలేదు. ప్రజావాణిలో పాస్​బుక్​ కోసం జూలైలో దరఖాస్తు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పిచ్చయ్యకు డాక్టర్​ చిన్నారెడ్డి, నోడల్​ అధికారి దివ్య దేవరాజన్​ పాస్​ బుక్​ను అందజేశారు. ముఖ్య మంత్రి రేవంత్​ రెడ్డికి పిచ్చయ్య తనకుమారులు నరసింహా , స్వామి యాదవ్​ కృతజ్ఞతలు తెలిపారు.