- నాలుగేండ్ల టర్మ్ ముగియడంతో గ్రేడ్ 4 పదోన్నతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్ల టర్మ్ పూర్తి అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల( జేపీఎస్)ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. వీరిని గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నాలుగేండ్ల టర్మ్ ముగిసిందని జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) రిపోర్ట్ ఇవ్వటంతో ఉత్తర్వులు జారీ చేశారు.
2018లో అప్పటి ప్రభుత్వం 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శు లను రిక్రూట్ చేసుకోగా మూడేండ్ల ప్రోబెషన్ టైమ్ ను ఖరారు చేసింది. తరువాత మరో ఏడాది పొడిగించింది. గ్రేడ్ 4 గా రెగ్యులర్ చేయటానికి నాలుగేండ్ల సర్వీస్ కచ్చితంగా పూర్తి కావాలని అప్పటి ప్రభుత్వం ఖరారు చేయటంతో దశల వారీగా రెగ్యులర్ చేస్తున్నారు. మొత్తం 6,603 గ్రేడ్ 4 పోస్టులు ఉండగా జేపీఎస్ లు గ్రేడ్ 4 సెక్రటరీలుగా 4,462 మంది మారగా, తాజాగా మరో 463 మంది ని గ్రేడ్ 4 గా మార్చారు.