
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. శనివారం ఈ కేసు వివరాలను సీఐ కరుణాకర్, ఎస్ఐ యయాతి కలిసి వెల్లడించారు. అశ్వారావుపేటలోని లక్ష్మీ తులసి పేపర్ బోర్డ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న లారీ ( MP 09 HH 8811)ని ఆపి చెక్ చేయగా, అందులో 463 కేజీల (216 ప్యాకెట్లు) గంజాయి చూసి షాక్ అయ్యారు.
దీంతో లారీలోని డ్రైవర్ రాజేశ్ గుల్జార్, సాలాగ్రామ్, ముఖేశ్ సూర్యవంశీని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన సోమనాథ్, ఠాగూర్, మరో వ్యక్తితో వీరు డీల్ చేసుకొని, సరుకును ఏపీలోని విజయనగరం నుంచి మధ్యప్రదేశ్ లోని బీజాపూర్ జిల్లాకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.2.31 కోట్ల వరకు ఉంటుందన్నారు. నిందితుల నుంచి గంజాయి రవాణాకు ఉపయోగించిన 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.