- 41 నుంచి 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- కోదాడ మండలం తొగరాయి, వలిగొండ లో 46.4 డిగ్రీలు
- బయటకి రావాలంటే జంకుతున్న జనం
సూర్యాపేట, యాదాద్రి, వెలుగు : సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్ లో రికార్డ్‌స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి, మునగాల మండలంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగత నమోదైంది. యాదాద్రి జిల్లా వలిగొండలో 46.3, యాదగిరిగుట్టలో 45.9 ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు మండుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
సూర్యాపేటలో..
నెల రోజుల తర్వాత సూర్యాపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. మే 1న మునగాల మండలంలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మట్టంపల్లి, మేళ్లచెర్వు, పెన్ పహాడ్, అనంతగిరి, కోదాడ మండలాల్లో 46 డిగ్రీలు, 10 మండలాల్లో 45 డిగ్రీలకి పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోదాడ మండలం తొగరాయి, మునగాల మండలంలో అత్యధికంగా 46.4 డిగ్రీలు, పెన్ పహాడ్, చిలుకూరు, దొండపాడులో 46.1,
పెదవీడు 45.5 డిగ్రీలు, మామిళ్లగూడెం 45.2, గొండ్రియాల 45.1, నడిగూడెం 45.0, తిరుమలగిరి 44,9 చిలుకూరు, అనంతగిరి మండలాల్లో 44.8, పాలకవీడు, నూతనకల్, చివ్వెంల మండలాల్లో 44.5, నడిగూడెంలో 44.3, సూర్యాపేట మండలంలో 44.0 చొప్పున ఉష్ణోగ్రతలు సమోదయ్యాయి.
యాదాద్రిలో..
యాదాద్రి జిల్లాలో గత నెలను మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని వలిగొండలో శుక్రవారం 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత, యాదగిరిగుట్టలో 45.9 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్లో ఇదే అధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎండ 41కి తగ్గకుండా కొడుతోంది. దీంతో వలిగొండ, యాదగిరిగుట్టలో వాతావరణశాఖ రెడ్అలర్ట్ప్రకటించింది. జిల్లాలోని మిగిలిన 26 చోట్ల ఆరంజ్అలర్ట్ ప్రకటించింది.
మార్చి మూడో వారం వరకు జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత మించలేదు. నాలుగో వారంలో 40 డిగ్రీలు దాటింది. ఏప్రిల్‌లో రికార్డ్‌స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈనెల 28 వరకు కూడా సాధారణ ఉషోగ్రతలు నమోదు కాగా, గత రెండు రోజుల నుంచి మూడు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది.