మునుగోడు బరిలో 47 మంది క్యాండిడేట్స్

  • ఎక్కువ మంది అభ్యర్థులతో ఎవరికి లాభం?      
  • ఇందులో 33 మంది స్వతంత్రులే
  • ఎవరి ఓట్లు చీలుస్తారోనని  ప్రధాన పార్టీల్లో టెన్షన్
  • టీఆర్ఎస్ ను కలవరపరుస్తున్న 
  • రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్న పార్టీలు కూడా బరిలోకి దిగి క్యాంపెయిన్  కూడా సీరియస్‌గానే చేస్తున్నాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఎస్పీ, టీజేఎస్, సకల జనుల పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ, సోషల్‌ జస్టిస్ పార్టీ, యుగతులసి, ప్రజావాణి, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తదితర రిజిస్టర్ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. 33 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. అయితే చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల వల్ల ఎవరికి.. ఎంత నష్టం అనే కోణంలో ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికలో ప్రతి ఓటు కీలకం కావడంతో చిన్నపార్టీలు, ఇండిపెండెంట్లు ఏ పార్టీ ఓట్లు చీలుస్తారు? ఎవరి గెలుపు, ఓటములను తారుమారు చేస్తారనే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

ఆర్ఎస్పీకి తొలి పరీక్ష..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరాక..ఆ పార్టీ పోటీ చేస్తున్న తొలి అసెంబ్లీ స్థానం మునుగోడే. స్వయంగా ఆయనే ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లు 35 వేల వరకు ఉండడం, దళిత్ యూత్ లో ఆయనకు ఫాలోయింగ్ ఉండడంతో ఓట్లు భారీగానే చీలుస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అభ్యర్థిగా శంకరాచారిని ప్రకటించడంతో బీసీ ఓట్లు కూడా బాగానే పడుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఎస్పీ బ్యాలెట్ పేపర్ లో ఫస్ట్ నంబర్ లో ఉండడం, ఏనుగు గుర్తు గుర్తు పట్టేలా ఉండడం బీఎస్పీకి కలిసొచ్చే అంశం అని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. అలాగే మరోవైపు ఇదే దళిత, బహుజన నినాదంతో దళిత్ శక్తి ప్రోగ్రాం(డీఎస్పీ) అభ్యర్థి గాలయ్యను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ పోటీకి నిలిపారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపడంతో బీఎస్పీ, డీఎస్పీలు ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. ఈ రెండు పార్టీలు చీల్చే ఓట్లు ఏ ప్రధాన పార్టీ అభ్యర్థికి నష్టం కలిగిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే దళితుల ఓట్లలో చీలిక టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టీజేఎస్​ కూడా ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌ కూడా మునుగోడులో అభ్యర్థిని బరిలోకి దింపింది. చండూరు మండలం బొడంగిపర్తికి చెందిన పల్లె వినయ్‌ కుమార్‌ బరిలో నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన కోదండరాం, వినయ్ కుమార్ ప్రభావంతో టీజేఎస్ కూడా కొంత మేర ఓట్లు చీల్చే అవకాశం లేకపోలేదు.  

కారును పోలిన గుర్తులకు వేలాది ఓట్లు

గతంలో జరిగిన ఎన్నికల్లో కారును పోలిన గుర్తుకు వేలాది ఓట్లుపడడం ఇప్పుడు టీఆర్​ఎస్​ కలవరానికి కారణమవుతున్నది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌ నియోజకవర్గంలో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు 11 వేల ఓట్లు పోలవ్వగా..ఇక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం 6 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. పెద్దగా ప్రచారం చేయకపోయినా జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో రోడ్డు రోలర్ కు 4,330 ఓట్లు పోలయ్యాయి. అలాగే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి. ఇదే టీఆర్ఎస్ ఓటమికి కారణమనే చర్చ జరిగింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో  కారును పోలిన రోటీ మేకర్ కు 3,700 ఓట్లు పోలయ్యాయి. అలాగే కమలం పువ్వును పోలిన డైమండ్‌ గుర్తు ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇలా గుర్తులను పోలిన గుర్తులు పలుస్థానాల్లో గెలుపోటములను తారుమారు చేశాయి.

ప్రధాన పార్టీలకు గుర్తుల గుబులు..

మునుగోడు ఉప ఎన్నికల్లో రిజిస్టర్డ్ పార్టీలు, ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవరపరుస్తున్నాయి. వారికి కేటాయించిన గుర్తులు కారు, కమలం గుర్తులను పోలి ఉండటంతో..తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 
ఈ ఎన్నికలో టీఆర్ఎస్ ను ప్రధానంగా రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. లాటరీలో దక్కినట్లే దక్కి కోల్పోయిన రోడ్డు రోలర్ గుర్తును సాధించేందుకు యుగతులసి ఫౌండేషన్ అభ్యర్థి శివ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేసి, కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మొదటి బ్యాలెట్ లోనే రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు ఉండడం టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది.