జపాన్​లో రెండు రోజుల్లో.. 155 సార్లు భూకంపం

  • రిక్టర్ స్కేలుపై తీవ్రత 3 నుంచి 7.60గా నమోదు
  • 10 వేలకు పైగా ఇండ్లు ధ్వంసం
  • 48 మంది మృతి.. 20కిపైగా మందికి గాయాలు
  • మృతులంతా ఇషికావా స్టేట్ వాసులే.. ఇంకా శిథిలాల కిందే  చిక్కుకున్న అనేక మంది  

వాజిమా (జపాన్): వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతున్నది. మంగళవారం కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. రెండు రోజుల్లో మొత్తం 155 సార్లు భూమి కంపించినట్లు  అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3 నుంచి 7.6గా నమోదైనట్టు తెలిపారు. వేలాది బిల్డింగ్​లు కూలిపోయాయి. మొత్తం 48 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండే అవకాశం ఉందన్నారు. మృతులు,  క్షతగాత్రుల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని  తెలిపారు. భూకంపం ధాటికి వేలాది వాహనాలు, బోట్లు ధ్వంసం అయ్యాయి. రానున్న మరికొన్ని రోజుల్లో మరింత తీవ్రతతో భూమి కంపించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని రోజులు ఇండ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇషికావా స్టేట్​తో పాటు చుట్టూ ఉన్న నగరాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చనిపోయిన 48 మంది ఇషికావా స్టేట్​కు చెందినవాళ్లే అని అధికారులు గుర్తించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు

ఇషికావాలో 10వేలకు పైగా భవనాలు కూలడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు. జపాన్​లోని చాలా ఏరియాల్లో పవర్ సప్లై లేదు. దీనికితోడు నీళ్లు కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్​ఫోన్ టవర్స్ కూలిపోవడంతో సిగ్నల్స్​ రావడం లేవు. జపాన్ మిలటరీకి చెందిన వెయ్యి మందిసైనికులు  రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, సునామీ హెచ్చరికలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. తీర ప్రాంతాల్లో ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులోనే అలలు ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సిటీలో మంటలు ఆర్పేశారు   

నైగటా, టయోమా, నోటో, ఫుకూయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిఫూ నగరాల్లో సంభవించిన భూకంపం కారణంగా పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. వాజిమా సిటీలో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. న్యూక్లియర్ ప్లాంట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అన్ని రియాక్టర్లు నార్మల్​గానే పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 2011, మార్చిలో సంభవించిన భూకంపం, సునామీ టైమ్​లో మూడు రియాక్టర్లు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. అప్పట్లో పెద్ద మొత్తంలో రేడియేషన్ రిలీజ్ అయిందని తెలిపారు. తాజా భూకంపం కారణంగా తీర ప్రాంతాలతో పాటు భూకంప ప్రభావిత ప్రజలు ఆడిటోరియంలు, స్కూల్స్, కమ్యూనిటీ సెంటర్లలో తలదాచుకుంటున్నారు.