జగిత్యాల: వినూత్న తరహాలో వీఆర్ఏలు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట 48గంటలపాటు ఏకధాటి నిరసన ప్రారంభించారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ.. ఆట పాటలు.. భజనలతో నిరసన కొనసాగిస్తున్నారు.
వీఆర్ఏలు సామూహికంగా చేస్తున్న నిరసన రాత్రి కూడా కొనసాగిస్తున్నారు.
పగలంతా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించిన నాయకుల ప్రసంగాలు.. నినాదాలతో గడచిపోగా.. రాత్రి చీకటి పడిన తర్వాత వీఆర్ఏలు ఆట పాటలు.. భజనలు చేపట్టారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ పాటలు పాడారు. తమ డిమాండ్ల సాధించుకునే వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీవో ఆఫీస్ ఎదుట తిండి, నిద్ర పేరుతో 48 గంటల పాటు ఆందోళన చేసి ప్రభుత్వ తీరును ఎండగడతున్నామని ఈ సందర్భంగా వీఆర్ఏ ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయమైన తమ డిమాండ్లను ఆమోదించాలని కోరారు.