487 మందితో అమెరికా నుంచి మరో విమానం: సంకెళ్లు వేయకుండా పంపాలని ఇండియా రిక్వెస్ట్

487 మందితో అమెరికా నుంచి మరో విమానం: సంకెళ్లు వేయకుండా పంపాలని ఇండియా రిక్వెస్ట్

అక్రమ వలసదారులపై వేట ముమ్మరం చేసింది అమెరికా. దేశ వ్యాప్తంగా 44 వేల మంది ఉద్యోగులు.. వలసదారులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు అమెరికా భద్రతా అధికారులు. వీరిని తిరిగి ఇండియా పంపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మన కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు. 

ALSO READ | అమెరికా నుంచి అమృత్‌‌ సర్​కు 104 మంది ఇండియన్లు

అమెరికాలో నివసిస్తున్న మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను అక్కడి అధికారులు గుర్తించారని, వారిని త్వరలో బహిష్కరించనున్నట్లు సమాచారం ఇచ్చారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారం ప్రకటన చేశారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు.  పట్టుబడిన వారి వివరాలేంటి..? ఎక్కడ పట్టుబడ్డారు..? వంటి సమాచారాన్ని అమెరికా అధికారులు ఇంకా అందించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ 487 మందిని కూడా యుద్ధ విమానాల్లోనే ఇండియాకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆ విమానాలు టేకాఫ్ కావొచ్చని సమాచారం. 

సంకెళ్లు వేయకుండా..!

అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా ఆ క్రమంలో వారికి సంకెళ్లు వేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. భారతీయుల పట్ల ఈ అవమానకరమైన చర్యలు నిలువరించడానికి మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ.. ఈసారి సంకెళ్లు వేయకుండా తీసుకురావాలని అమెరికాకు విజ్ఞప్తి చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, అందుకు అక్కడి అధికారులు అంగీకరించారా..! లేదా..! అనే దానిపై స్పష్టత లేదు.