ఉమ్మడి పాలమూరు జిల్లాకు 49 వేల ఇందిరమ్మ ఇండ్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాకు  49 వేల ఇందిరమ్మ ఇండ్లు
  • తీరనున్న పేదల సొంతింటి కల

మహబూబ్​నగర్, వెలుగు : దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. స్కీమ్​ను సోమవారం నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఫస్ట్​ ఫేస్​లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని 49 వేల కుటుంబాలకు ఈ స్కీమ్​ ద్వారా సొంతింటి కల నెరవేరనుంది. అయితే గత ప్రభుత్వం పదేండ్లలో ఉమ్మడి జిల్లాకు 22 వేల ఇండ్లను మంజూరు చేసి, ఆరు వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసింది. పైగా పంపిణీలో అక్రమాలు జరగడంతో ఎంక్వైరీలు జరుగుతున్నాయి.

20 శాతం కుటుంబాలకు లబ్ధి..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 36.14 లక్షల జనాభా ఉండగా, 2,43,796 కుటుంబాలు అద్దె ఇండ్లల్లో ఉంటున్నాయి. ఇందులో అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లాలో 70,025 కుటుంబాలు ఉండగా,  మహబూబ్​నగర్​లో 59,788, నారాయణపేటలో 37,712, గద్వాలలో 39,047, వనపర్తిలో 37,224 కుటుంబాలున్నాయి. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ ద్వారా మొదటి విడతలో దాదాపు 49 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 

ఫస్ట్  ఫేస్​లో సొంత జాగా ఉన్న వారికి స్కీమ్​లో ప్రియారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది. సెకండ్​ ఫేస్​లో సొంత జాగా లేని వారిని అర్హులుగా గుర్తించి, ప్రభుత్వమే వారికి స్థలం చూపించనుంది. ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి స్కీం ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. ఈ స్కీం ద్వారా నాలుగు విడతల్లో లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. బేస్​మెంట్​ స్థాయిలో రూ.లక్ష, రూఫ్​ లెవల్​లో రూ.లక్ష, పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందజేయనుంది. ఏడాదిలోపు ఈ నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐదేండ్లలోపు ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటిని నిర్మించి ఇచ్చేలా ప్లాన్​ చేస్తోంది. ఇదిలాఉంటే మొదటి విడతలో 20 శాతం పైగా పేదల సొంతింటి కల నెరవేరనుంది.

గత ప్రభుత్వంలో 22,190 ఇండ్లే మంజూరు..

2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం టార్గెట్​ మేరకు ఉమ్మడి జిల్లాలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పూర్తి చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,190 ఇండ్లను మంజూరు చేయగా, 6,424 ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు. చాలా చోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో వారు పనులను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నిర్మాణాలు పునాది దశ దాటలేదు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా, ఎవరికీ పంపిణీ చేయలేదు. తాగునీరు, విద్యుత్​ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో పంపిణీ చేసిన ఇండ్లల్లో ఎవరూ  ఉండడం లేదు. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలమూరు జిల్లా కొత్త కలెక్టరేట్​ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్​ ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించినా మంజూరు చేయలేదు. కనీసం పదేండ్ల కింద మంజూరు చేసిన ఇండ్లను కూడా పూర్తి చేయలేకపోయారు.

ఇండ్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు..

డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీ విషయంలో గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. అర్హులకు కాకుండా ఆ పార్టీ లీడర్లు, వారి అనుచరులు, బంధువులకు ఇండ్లు ఇప్పించారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఆ పార్టీకి చెందిన కొందరు మున్సిపల్​ కౌన్సిలర్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఇండ్లు అమ్ముకున్నారనే టాక్​ నడిచింది. ప్రధానంగా జడ్చర్ల, మహబూబ్​నగర్​ మున్సిపాల్టీల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అలాగే డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల కోసం బీఆర్ఎస్​ లీడర్లు తమ నుంచి డబ్బులు తీసుకున్నారని, ఇండ్లు మంజూరు చేయలేదని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. 

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో డబుల్​ ఇండ్ల పరిస్థితి

జిల్లా         మంజూరు    పూర్తయినవి    పెండింగ్​    స్టార్ట్​ చేయనివి
మహబూబ్​నగర్​    8,768    4,321    2,125    2,322    
నారాయణపేట    2,017    00    360    1,657
గద్వాల        2,070    580    715    755
వనపర్తి        3,835    1,203    1,786    846
నాగర్​కర్నూల్​    5,500    320    550    4,630
మొత్తం        22,190     6,424    5,396    10,230