- మెరుగైన సేవల కోసమేనని టీజీబీ చైర్ పర్సన్ శోభ వెల్లడి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలన్నీ జనవరి 1న తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) లో విలీనం అవుతాయని బ్యాంక్ చైర్ పర్సన్ వై.శోభ తెలిపారు. ఆ తర్వాత బ్యాంక్టర్నోవర్ రూ.30 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లకు చేరుకుంటుందన్నారు. 928 శాఖలతో దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా టీజీబీ నిలుస్తుందని చెప్పారు. శుక్రవారం ఆమె నల్లకుంటలోని టీజీబీ బ్యాంక్హెడ్డాఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఒక రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు’ అనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా రెండూ(ఏపీజీవీబీ, టీజీబీ) కలిపి ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతాయన్నారు.
తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న 493 ఏపీజీవీబీ శాఖలు.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు 435 శాఖలతో 18 జిల్లాలలో సేవలు అందిస్తాయని, విలీనం తర్వాత తెలంగాణలోని 33 జిల్లాల్లో 928 శాఖలుగా టీజీబీ రూపాంతరం చెందుతుందని వివరించారు. ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల ఆప్షన్ల పక్రియ కొలిక్కి వచ్చాయని వెల్లడించారు. విలీనం నేపథ్యంలో 28 నుంచి 31 వరకు సేవల్లో కొంత అంతరాయం ఉంటుందన్నారు. ఖాతాదారులు 30, 31న నుంచి రూ.5వేలు వరకు విత్ డ్రా చేసుకోవచ్చని, ఏపీజీవీబీ ఖాతాదారులు వారి ఏటీఎం కార్డు, యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ సేవలను తిరిగి పొందేందుకు ఒకటో తేదీ నుంచి టీజీబీ శాఖను సంప్రదించాలని సూచించారు. పాత చెక్కులు, డీడీల క్లియరెన్స్ మార్చి 31 వరకు ఉంటుందన్నారు.