వరంగల్ అభివృద్ధికి రూ.4,962 కోట్లు

వరంగల్ అభివృద్ధికి రూ.4,962 కోట్లు
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసమే రూ.4,170 కోట్లు
  • వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్​కు ఆమోదం.. 
  • మామునూర్ ఎయిర్​పోర్టు కోసం భూ సేకరణ
  • టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటుకు 160 కోట్లు
  •  నేడు వరంగల్​లో విజయోత్సవ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

వరంగల్‍, వెలుగు : వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,962 కోట్లు కేటాయించింది. మామునూర్ ఎయిర్​పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041కి సోమవారం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 202 జారీ చేసింది.అదేవిధంగా, మామునూర్ ఎయిర్​పోర్టును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి కావాల్సిన 253 ఎకరాలు సేకరించేందుకు రైతులను ప్రభుత్వం ఒప్పించింది.

కాకతీయ టెక్స్​టైల్ పార్క్​తో ఉద్యోగ అవకాశాలు

గీసుకొండ మండలంలో కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,350 ఎకరాలు సేకరించింది. 2017లో శంకుస్థాపన చేసింది. ఏడాదిలో 60వేల మందికి ప్రత్యక్షంగా, 40వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు పార్క్​లో ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లిస్తామని ఒప్పించింది. చివరికి ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 863 మంది రైతులకు స్పెషల్ కోటాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్స్​టైల్ పార్క్ ఏరియాలో వరద ముప్పు రాకుండా నాలాలు, చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి రూ.160 కోట్లు మంజూరు చేసింది. 

రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

2015లో అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్ సిటీలో పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు. 2023లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ వరంగల్ సిటీలో పర్యటించి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రూ.4,170 కోట్ల నిధులు కేటాయించారు. 

నేడు వరంగల్​కు సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు మంగళవారం సీఎం రేవంత్ వరంగల్ వెళ్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బాల సముద్రంలోని కుడా గ్రౌండ్​కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు. తర్వాత కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభిస్తారు. 3.10 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్​లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడుతారు. తర్వాత మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్​జెండర్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

కాళోజీ కళాక్షేత్రం పూర్తి

9 ఏండ్లుగా స్లాబ్, గోడలకే పరిమితమైన కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసింది. దీని కోసం రూ.95 కోట్లు ఖర్చు చేసింది. నయీంనగర్ బ్రిడ్జి కోసం రూ.8.3 కోట్లు, నాలా వెడల్పు, రిటర్నింగ్ వాల్ పనులకు రూ.90 కోట్లు ఖర్చు చేసింది. ఎర్రగట్టుగుట్ట నుంచి పరకాల వరకు దాదాపు 26 కిలో మీటర్ల మెయిన్ రోడ్డును ఫోర్ వే లేన్​గా మార్చేందుకు రూ.65 కోట్లు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్​కు రూ.80 కోట్లు, గ్రేటర్ కార్పొరేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.32 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరు చేసింది.