గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లిలో సున్నపురాతిలో చేసిన 3 ఇంచుల ఎత్తు ఉన్న చిన్న వరాహమూర్తి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు గుర్తించారు. ఈ శిల్పంలోని వరాహమూర్తి పాదాలకు హై హీల్స్ పాదుకలు ఉండడం విశేషం. ఈ శిల్పం 4వ శతాబ్దానికి చెందినదని, ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ రూపం అపురూపమైనదని, అరుదైనదని స్థపతి, చరిత్రకారుడు డా.ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.
కోట్లనర్సింహులపల్లెలో గతంలో శాతవాహనకాలం నాటి కుండ పెంకులు, కొత్తరాతియుగం రాతిగొడ్డలి ముక్క, మధ్యరాతియుగంనాటి రాతిపరికరాల కండశిల లభించాయి. ఈ చిన్నవరాహస్వామి అర్చామూర్తి శిల్పం తొలుత కొండమోతులో దొరికిన నరసింహస్వామి ఫలకాన్ని గుర్తు చేస్తోందని, నరసింహస్వామి క్షేత్రంలో ఇప్పుడు ఈ వరాహమూర్తి దొరకడం చారిత్రకంగా విశేషమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొల్లూరి సాయి ఉన్నారు.