- గుప్త నిధులు, క్షుద్ర పూజల కోసమే ఘాతుకం
కాగజ్ నగర్, వెలుగు: పాతి పెట్టిన శవాన్ని క్షుద్ర పూజలు, గుప్త నిధుల కోసం బయటకు తీసి.. ఆ తర్వాత కోసి, బొక్కలు తీసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటిగూడలో జరిగిన ఘటనకు సంబంధించి నిందితుల అరెస్టు వివరాలను గురువారం కౌటాల సర్కిల్ అఫీస్‌లో ఎస్ఐ ప్రవీణ్‌తో సీఐ ముత్యం రమేశ్ వెల్లడించారు. ఏటిగూడ గ్రామానికి చెందిన ఎర్నేని చిన్నన్న ఈ నెల 16న అనారోగ్యంతో చనిపోయాడు. మరుసటి రోజు కుటుంబీకులు ఆయన డెడ్‌బాడీని ఊరి సమీపంలో పూడ్చిపెట్టారు.
ఈ క్రమంలో ఈ నెల 29న ఉదయం మృతుడి కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా దుర్వాసన వచ్చింది. అక్కడ నిమ్మకాయలు, గుమ్మడి కాయ, పసుపుకుంకుమతో పూజలు చేసినట్లు.. డెడ్‌బాడీని బయటకు తీసి, కోసి ఎముకల ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. భయాందోళనకు గురైన వారు బెజ్జూర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. బెజ్జూర్‌కు చెందిన రమేశ్, బెజ్జూర్ మండలం గబ్బాయి గ్రామానికి చెందిన శంకర్, హేటిగూడ గ్రామనికి చెందిన రావుజి, కరీంనగర్‌కు చెందిన పరమేశ్వర్, కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన గొల్ల రాజులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. గురువారం ఉదయం బెజ్జూర్ మండలం కుశ్నపల్లి సమీపంలో ఐదుగురు నిందితులను పట్టుకున్నట్లు సీఐ రమేశ్ తెలిపాడు.
బొక్కలను తీసుకెళ్లి.. పసుపు, ఉప్పు రాసి ఆరబెట్టి
గుప్త నిధుల అన్వేషణ కోసమే పూడ్చిన శవాన్ని తవ్వి బయటకు తీసి ఎముకలను ఇంటికి తీసుకెళ్లి బొక్కలకు పసుపు, ఉప్పు రాసి ఎండబెట్టారని, అ తర్వాత క్షుద్ర పూజలు చేసినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు. గుప్త నిధులు, క్షుద్ర పూజలకు అలవాటు పడి అత్యాశతో గ్యాంగ్‌గా ఏర్పడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.