పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. భారీ శబ్ధాలతో లోకో పైలట్ అలెర్ట్

పండగ పూట పెను ప్రమాదం తప్పింది. మంగళవారం (14) ఉదయం తమిళనాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కనీసం ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సకాలంలో భారీ శబ్దాలతో అప్రమత్తమైన  లోకో పైలట్ వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి కిందకు దించామని, ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది, ఇంజనీర్లు ఘటనాస్థలికి చేరుకొని పట్టాలు తప్పిన రైలును సరిచేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

ఈ ఘటన సాంకేతిక లోపం కారణంగా జరిగిందా..! లేదా ఏదైనా కుట్ర దాగుందా..! అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విల్లుపురం రైల్వే పోలీసులు ఈ విషయంపై లోతైన విచారణ ప్రారంభించినట్లు రైల్వే శాఖ తెలిపింది.