
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఢిల్లీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేను సీఎంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాలు ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనించాయి. ఎవరీ రేఖా గుప్తా..? చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ ఎందుకు ఈమెకు బీజేపీ అధిష్టానం ఇంత ప్రియారిటీ ఇచ్చింది..? పైగా.. ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం లేని మహిళను సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో బీజేపీ హైకమాండ్ అంతర్గత వ్యూహమేంటి..? ఈ ప్రశ్నలన్నీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన మరు క్షణం నుంచి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రేఖా గుప్తానే ఎందుకనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు కొన్ని కీలక కారణాలను ప్రస్తావించారు. అవేంటంటే..
1. ఢిల్లీ సీఎంగా మహిళకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావించడం:
ఢిల్లీలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచినప్పటి నుంచి ఢిల్లీ సీఎం రేసులో చాలామంది పేర్లు వినిపించాయి. మహిళను సీఎం చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తే.. బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఢిల్లీ ఫలితాల అనంతరం చెప్పుకొచ్చాయి. కానీ.. అనూహ్యంగా రేఖా గుప్తా పేరును బీజేపీ హైకమాండ్ తెర మీదకు తెచ్చింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు, అది కూడా మహిళకు సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావించడమే ఇందుకు కారణం. బీజేపీలో మహిళలకు ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని, ఏ రాష్ట్రంలో కూడా మహిళను ముఖ్యమంత్రిగా ఎన్డీయే ఎంపిక చేయకపోవడమే ఇందుకు నిదర్శమని తృణముల్ కాంగ్రెస్ పదేపదే విమర్శిస్తోంది. ఈ విమర్శలను బీజేపీ ఇన్నాళ్లూ బలంగా తిప్పికొట్టలేకపోయింది. ఈ విమర్శల ప్రభావం మహిళా ఓటు బ్యాంకుపై పడుతుందని భావించిన బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎంను చేసింది.
2. ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలనుకోవడం:
రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కడం వెనుక సామాజిక వర్గాల లెక్కలు కూడా కీలక పాత్ర పోషించాయి. బీజేపీ అధిష్టానం ఢిల్లీలో సామాజిక వర్గాల లెక్కలను కూడా బేరీజు వేసుకుని ఆమెకు ఆ పోస్ట్ను కట్టబెట్టింది. వైశ్య సామాజిక వర్గంతో పాటు ఇతర ఓబీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ఈ వ్యూహ రచన చేసింది. రేఖా గుప్తా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గం కూడా ఇదే కావడం గమనార్హం. ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి 8 శాతం ఓటు బ్యాంకు ఉంది.
పైగా.. ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిలో ఎక్కువ మంది వ్యాపారాలు, దుకాణాలతో అను నిత్యం మధ్య తరగతి ప్రజలతో మమేకమై ఉన్నారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 30 శాతం వ్యాపార వర్గాలతో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుని రేఖా గుప్తా సామాజిక వర్గానికి సీఎం పదవిని బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. మరో ప్రధాన కారణం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. బీహార్లో కూడా వైశ్య సామాజిక వర్గం ప్రభావం ఎక్కువే ఉంది. బీహార్లో ఓబీసీలు 27 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో కీలకంగా ఉన్నారు. ఈ అంశాలు కూడా రేఖా గుప్తాకు సీఎం సీటు దక్కడానికి కారణమయ్యాయి.
3. యూపీలో ఓబీసీ ఓటు బ్యాంకు కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం భావించడం:
బీహార్ మాత్రమే కాదు యూపీలో ఓబీసీ ఓటు బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకునేందుకు రేఖా గుప్తాకు సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావించింది. యూపీలో కూడా ఓబీసీల ఓటు బ్యాంకు భారీగా ఉంది. దాదాపు 52 శాతం ఓట్లు ఓబీసీలవే.
ఢిల్లీలో రేఖా గుప్తాను సీఎంగా ప్రకటిస్తే ఓబీసీలకు బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలు యూపీలో కూడా బీజేపీ పట్ల సానుకూలత పెంచుతాయని ఆ పార్టీ భావించింది. ఓబీసీ ఓటర్లలో సమాజ్ వాదీ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించి వారిని తమ వైపు తిప్పుకోవచ్చనే వ్యూహంతో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ అధిష్టానం ప్రతిపాదించింది.
4. రేఖా గుప్తాకు బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం:
ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1996 నుంచి-1997 మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా పనిచేశారు. రేఖా గుప్తా రాజకీయ జీవితం 2000లో ప్రారంభమైంది. 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎమ్)లో చేరి ఢిల్లీ యూనిట్‌లో కార్యదర్శిగా పనిచేసి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
2007లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2009 వరకు ఎమ్ సీడీలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. ఈ స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ రేఖా గుప్తాకు కలిసొచ్చింది.
5. మహిళలకు బీజేపీ హై ప్రియారిటీ ఇస్తుందని సంకేతాలివ్వడం:
రాజకీయంగా మహిళలకు బీజేపీ సముచిత స్థానం కల్పిస్తుందని దేశవ్యాప్తంగా సంకేతాలు పంపాలని బీజేపీ డిసైడ్ అయింది. రాజకీయంగా హై ప్రియారిటీ ఉన్న ఢిల్లీకి, దేశ రాజధానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన మహిళను సీఎం చేసి బీజేపీ మహిళలకు అగ్ర తాంబూలం ఇస్తుందనే సానుకూల సంకేతాలను బీజేపీ హై కమాండ్ ఆశించింది. దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై మహారాష్ట్రలో ఉండటం, దేశ రాజధాని ఢిల్లీ నగరం కావడమే ఇందుకు కారణం.
ALSO READ | ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్.. సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం
దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా కేంద్ర ప్రభుత్వం కొలువుదీరి ఉండేది ఢిల్లీలో కాబట్టి రాజకీయంగా హస్తినదే అగ్ర తాంబూలం. ఎన్డీయే, ఇండియా కూటమిలకు సంబంధించిన ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఉంటే మెజారిటీ నిర్ణయాలకు ఢిల్లీ ఆమోదముద్ర పడాల్సిందే. అలాంటి ఢిల్లీకి సీఎం అంటే ఆషామాషీ విషయం కాదు. ఇలాంటి ఢిల్లీకి రేఖా గుప్తాను సీఎంగా బీజేపీ ప్రతిపాదించడం వెనుక ఇన్ని లెక్కలున్నాయి.