70 ఏండ్లు దాటినోళ్లకు 5 లక్షల ఆరోగ్య బీమా

70 ఏండ్లు దాటినోళ్లకు 5 లక్షల ఆరోగ్య బీమా

 

 

  • జన్‌ ఆరోగ్య యోజన లాంచ్ చేసిన ప్రధాని.. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి లబ్ధి
  • గతంలో వైద్యం కోసం నగలు అమ్ముకునేటోళ్లు
  • ఢిల్లీ, బెంగాల్ ప్రజలు నన్ను క్షమించాలి
  • ఆయుష్మాన్ భారత్ అమలును ప్రభుత్వాలు అడ్డుకుంటున్నయ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 70 ఏండ్లు దాటిన వృద్ధులందరికీ ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్​తో లబ్ధి చేకూరుతుందని అన్నారు.

 ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల టాప్ అప్ లభిస్తుందన్నారు. ఒకప్పుడు ట్రీట్​మెంట్ కోసం ఇండ్లు, భూములు, నగలు అమ్ముకునేవాళ్లని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ బాధలు లేవని, ప్రతీ పేదోడికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. 

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద డేను పురస్కరించుకుని ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్ద పెద్ద రోగాల బారినపడినప్పుడు ట్రీట్​మెంట్​కు అయ్యే ఖర్చు విని చాలా మంది భయపడిపోయే వారన్నా రు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో వైద్యం చేయించుకోలేక చనిపోయేవాళ్లు అని తెలిపారు.

ఢిల్లీ, బెంగాల్ ప్రజలను స్కీమ్​కు దూరం చేస్తున్నరు

ఢిల్లీ, బెంగాల్ వాసులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ స్కీమ్​కు దూరం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘ఢిల్లీ, బెంగాల్ ప్రజలందరు నన్ను క్షమించాలి. ఆయుష్మాన్ భారత్ కింద మీకు సేవలందించలేకపోతున్న. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్​లను అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజల ప్రాణాలతో చెలగా టమాడుతున్నాయి. 

ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీకి అసలు మానవత్వమే లేదు. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ.. ఢిల్లీ, బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేకపోతున్న’’ అని మోదీ తెలిపారు.

12 వేల కోట్ల హెల్త్ కేర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్​గా ప్రారంభించారు. వీటిలో ఎక్కువగా హెల్త్ సెక్టార్ ప్రాజెక్టులే ఉన్నాయి. ఢిల్లీలో ఆలిండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫేజ్ 2ను మోదీ ప్రారంభించారు. ఇందులో ఆయుర్వేద మందుల తయారీ, సెంట్రల్ లైబ్రరీ, ఐటీ అండ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, ఆడిటోరియం ఉన్నాయి.

యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నం

వీలైనంత ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తు న్నామన్నారు. ‘రోజ్​గార్ మేళా’ కింద 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అపాయింట్​మెంట్ లెటర్లు అందజేసింది. ఈ సందర్భంగా మోదీ ఓ వీడియో రిలీజ్ చేశారు. 

‘‘సరికొత్త టెక్నాలజీ, స్పేస్, సెమీ కండక్టర్ల వంటి రంగాలను బలోపేతం చేస్తున్నం. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తున్నాయి. మన దేశం ఇంకా టెక్నాలజీపరంగా అభివృద్ధి చెందలేదని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరం. రోజ్​గార్ మేళా ద్వారా ఇప్పటి దాకా 7.50 లక్షల మందికి అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశామన్నారు’’ అని మోదీ తెలిపారు.