మేడారం జాతరకు ఒక్కరోజే 5 లక్షల మంది మొక్కుల చెల్లింపు

  • గద్దెలకు తాళాలేయడంతో.. దూరం నుంచే మొక్కుల చెల్లింపు
  • తాడ్వాయి‒ మేడారం రూట్‌‌లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • రోడ్డు రిపేర్లతో మేడారం రూట్​లో ట్రాఫిక్ ఆంక్షలు 

ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఐదు లక్షల మందికి పైగా తరలివచ్చారు. గద్దెలకు తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడ్వాయి‒ మేడారం రూట్‌‌‌‌లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జామ్​ అయింది. అడవిలోనే రెండు గంటల పాటు వెహికల్స్‌‌‌‌ ఆగిపోయాయి.

జయశంకర్‌‌ భూపాలపల్లి, తాడ్వాయి, వెలుగు:  రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకోవడానికి ఒకే రోజు 5 లక్షల మందికి పైగా వచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తాడ్వాయి‒మేడారం రూట్‌‌లో ట్రాఫిక్‌‌ జాం అయ్యింది. అడవిలోనే రెండు గంటల పాటు వెహికిల్స్‌‌ ఆగిపోయాయి. భక్తుల రాకను గుర్తించి దేవాదాయ శాఖ ఆఫీసర్లు గద్దెల దగ్గరికి ఎవరిని వెళ్లకుండా తాళాలు వేశారు. దూరం నుంచే భక్తులు మొక్కులు సమర్పించారు. ములుగు జిల్లా కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌‌ మేడారం వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలలో భక్తులు భారీగా మేడారం చేరుకున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాదాయ శాఖ ఆఫీసర్లు గద్దెల దగ్గరికి వెళ్లకుండా తాళాలు వేసి ఉంచారు. పాత క్యూలైన్‌‌ను బంద్‌‌ చేశారు. ఒక్కొక్కరు వెళ్లే విధంగా క్యూలలో పంపించారు. దీంతో భక్తులు గద్దెల వద్దకు చేరుకుని దేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ, బంగారం (బెల్లం), చీరసారే, పూలు సమర్పించారు.

రోడ్డు రిపేర్లతో ట్రాఫిక్ జామ్

పస్రా నుంచి మేడారం చేరుకునే రోడ్డు రిపేర్లు జరుగుతున్నందున వాహనాలను తాడ్వాయి మీదుగా మేడారం మళ్లించారు. ఒకేసారి అన్ని మార్గాల నుంచి వెహికల్స్‌‌ రావడంతో ఈ రూట్​లో 
ట్రాఫిక్‌‌ జామ్ అయ్యింది. శివరాం సాగర్ చెరువు  నుంచి నాలుగు కి.మీ పొడవునా గుడ్డేలుగు గుట్ట వరకు ట్రాఫిక్ లో వెహికల్స్‌‌ ఇరుక్కుపోయాయి. అలర్ట్‌‌ అయిన పోలీసులు ట్రాఫిక్‌‌ క్లియర్‌‌ చేశారు. శివరాం సాగర్ చెరువు వద్ద వీవీఐపీ, వీఐపీ రోడ్డు మార్గం నుంచి వాహనాలను వన్ బై వన్ పంపించారు.