స్కామ్​లో అరెస్ట్ కావొద్దంటే మనీ ట్రాన్స్ ఫర్ చెయ్  

 స్కామ్​లో అరెస్ట్ కావొద్దంటే మనీ ట్రాన్స్ ఫర్ చెయ్  
  •     ప్రైవేట్ఎంప్లాయ్​ని భయపెట్టి 
  •     రూ. 5 లక్షలు కొట్టేసిన  సైబర్ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు :  బ్యాంక్ స్కామ్ లో ఉన్నావని..హైదరాబాద్​కు చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ ని భయపెట్టి సైబర్ నేరగాళ్లు రూ. 5 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం.. కొద్దిరోజుల కింద ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ (28)కి ఎస్బీఐ క్రెడిట్ కార్డు వింగ్ నుంచి మాట్లాడుతున్నామని  కాల్ చేశారు. క్రెడిట్ కార్డు పెండింగ్ చార్జీలు రూ. 95 వేలు చెల్లించాలన్నారు. తనకు  క్రెడిట్ కార్డు లేదని చెప్పగా, ఓ సంస్థకు కంప్లయింట్ చేయాలని  ఓ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి వీడియో కాల్ చేయమని సూచించాడు.

ఆ నంబర్​కు వీడియో కాల్ చేయగా.. పోలీస్ యూనిఫామ్​ వేసుకున్న ఓ వ్యక్తి తన ఐడీ కార్డు చూపించాడు. ‘కెనరా బ్యాంక్​లో రెండున్నర కోట్ల స్కామ్ జరిగింది. అందులో నీ పాత్ర ఉంది. నీ బ్యాంక్ అకౌంట్స్ , ప్రాపర్టీస్ సీజ్ చేసి నిన్ను అరెస్టు చేస్తాం’ అని బాధితుడిని భయపెట్టాడు. కేసు నుంచి బయటపడాలంటే తాము అడిగినన్ని డబ్బులు తాము చెప్పిన అకౌంట్​కు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు.  ఆర్బీఐ గైడ్ టైన్స్​ మేరకు వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని అతడిని నమ్మించాడు.

దీంతో బాధితుడు తన అకౌంట్​లోని రూ. 5  లక్షలు వెంటనే వారు చెప్పిన అకౌంట్​ నంబర్​కు ట్రాన్స్​ఫర్​ చేశాడు. వెంటనే వీడియో కాల్ కట్ కాగా, తర్వాత ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.