
చెన్నై: తాను రోజుకు ఐదు లీటర్ల పాలు తాగేవాడినంటూ అంటూ కెరీర్ ప్రారంభంలో వచ్చిన అత్యంత హాస్యాస్పదమైన పుకారును టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ ఖండించాడు. అప్పట్లో బాగా వైరల్ అయిన దీనిపై మహీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. చెన్నైలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ.. తన ఆహారం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన రహస్యాలను వెల్లడించాడు. ‘
రోజుకు ఐదు లీటర్ల పాలు తాగడం అనే పుకారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నా పవర్ హిట్టింగ్‌కు ఇదే కారణమని కూడా అన్నారు. కానీ అదంతా వట్టిదే. బహుశా నేను రోజు మొత్తంలో కలిపి ఒక లీటర్ పాలు తాగేవాడ్ని. అది కూడా చాలా ఎక్కువే. ఇక నేను వాషింగ్ మెషిన్‌లో లస్సీ తయారు చేస్తానని వచ్చిన పుకారులో కూడా నిజం లేదు. ఎందుకుంటే నేను లస్సీ తాగను’ అని ధోనీ వెల్లడించాడు.
ఇక ఐపీఎల్‌లో సీఎస్కే ఆట తీరుపై కూడా మహీ స్పందించాడు. పేలవమైన బ్యాటింగ్ వల్లే టీమ్ విజయం సాధించలేకపోతోందన్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోవడం లేదా ఛేజింగ్‌లో తాము వెనకబడిపోతున్నామని చెప్పాడు. సెకండాఫ్‌లో మంచు ప్రభావం వల్ల బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు.