భూపాలపల్లి అర్బన్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లి వద్ద ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుల్లా కరుణాకర్ చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం యామన్‌పల్లి వద్ద ఎస్సై దాసరి సుధాకర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు బైక్‌లపై వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన దురిశెట్టి సాయిలు, కొత్తపల్లికి చెందిన మెరుగు స్వామి, రామారావుపల్లికి చెందిన నిమ్మరాజుల శంకర్, భీమ్లానాయక్ తండాకు చెందిన మూడ్ శివ, కమాన్పూర్మండలం రేపల్లెవాడకు చెందిన బొమ్మన కుమార్‌ను ఆపి తనిఖీ చేశారు.
వారి వద్ద 3 జిలెటిన్ స్టిక్స్, మూడు డిటోనేటర్లు, మావోయిస్ట్ సాహిత్యం, కరపత్రాలతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, రూ.21,630లు దొరికాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్‌లోని భీమారానికి వెళ్లి ఈగోల్లపు మల్లయ్య వద్ద నుంచి మావోయిస్టు రచనలు, కరపత్రాలు, జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు తీసుకున్నారని చెప్పారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రంజిత్‌రావు, ఎస్సై దాసరి సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ కిషన్, పీసీలు రాజేందర్, వినయ్ పాల్గొన్నారు.