ఐదు నెలల్లో ఐదుగురు గుడ్ బై

ఓ వైపు గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు ఒక్కరొక్కరుగా హ్యాండ్ ఇస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో హస్తం పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా చేరారు. ఆయన కాంగ్రెస్ కు  హ్యాండిచ్చి సైకిల్ ఎక్కారు.సమాజ్ వాదీ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశారు.ఈవిధంగా గత ఐదు నెలల్లో ఐదుగురు కీలక నేతలు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు.  

  • కాంగ్రెస్ ను వీడిన వారిలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశ్వనీ కుమార్ కూడా ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు పార్టీలో సేవలందించిన అశ్వనీకుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సోనియాగాంధీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ‘భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పునర్ వైభవాన్ని సంతరించుకునే దాఖలాలు దరిదాపుల్లో కనిపించడం లేదు’ అని ఆ సందర్భంగా అశ్వనీ కుమార్ వ్యాఖ్యానించారు. 
  • గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ యువ నేత హార్దిక్ పటేల్ మే నెల మొదటివారంలోనే కాంగ్రెస్ కు గుడ్ బై  చెప్పారు. గుజరాత్ కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విభేదాలు తారస్థాయికి చేరినందు వల్లే ఆయన హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారని సమాచారం. ‘కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఫోన్లలో మునిగిపోయారు. మాలాంటి నాయకుల మాటలు వినే ఓపిక వాళ్లకు లేదు’ అని రాజీనామా సందర్భంగా హార్దిక్ పటేల్ పేర్కొన్నాడు. 
  • గతంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత సునీల్ జఖార్ ఈనెల ప్రారంభంలోనే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ‘శత్రువులెవరో.. మిత్రులెవరో తెలుసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం లేదు’ అని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 
  • ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో గత 32 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ సైతం ఇటీవల ‘హస్తాన్ని’ వదిలేసి, కమలం జెండాను ఎత్తుకున్నారు. ‘గత 32 ఏళ్లలో ఏ దశలోనూ కాంగ్రెస్ పార్టీ నా సేవలను వినియోగించుకోలేక పోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు.. 

యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై ఉత్కంఠ

వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం