టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తలె : రావుల రామ్మోహన్ రెడ్డి

రా ష్ట్రంలో 12 వేల టీచర్​పోస్టులు భర్తీ చేస్తామని పదే పదే ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం.. టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి కూడా రాలేదు. 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్టీని పక్కన పెట్టడం సరికాదు. గత 8 ఏండ్లలో ఒకే ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ 2017లో వేశారు.80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్న ప్రభుత్వం.. అందులో ఉన్న12 వేల టీచర్ల  ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటి వరకు కేవలం 21 వేల ఖాళీలకు సంబంధించి11 రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం.. కొన్ని పరీక్షలు నిర్వహించింది. మరో 30 వేల ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసి 4 నెలలు గడుస్తున్నా.. వాటికి నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. ఇక మరో 30 వేల ఖాళీలకు ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి రాలేదు. నోటిఫికేషన్లపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల నిరుద్యోగ యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నది. వచ్చే సంవత్సరం నవంబర్ లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సరికి మరో 4 నెలలు పడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల లోపు అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలి.

- రావుల రామ్మోహన్ రెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, 
బీఎడ్ అభ్యర్థుల సంఘం