నోరు బాగుంటే మీ ఆరోగ్యం బాగున్నట్టే!.ఎలా అంటే.?

నోరు బాగుంటే మీ ఆరోగ్యం బాగున్నట్టే!.ఎలా  అంటే.?

వరల్డ్ ఓరల్​ హెల్త్ డే (మార్చి 20న) సందర్భంగా నోటి శుభ్రత, ఆరోగ్యం గురించి అవేర్​నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా తీసుకున్న థీమ్​ ‘ఎ హ్యాపీ మౌత్ ఈజ్​ ఎ హ్యాపీ మైండ్​’. ఇది​ ఓరల్, మెంటల్​ హెల్త్​కి ఉన్న సంబంధం గురించి చెప్తుంది. అంటే.. నోరు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందనేది ఈ థీమ్​ ఉద్దేశం. అయితే అసలు నోటికీ.. మనసుకు, శరీరానికి లింక్​ ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. కచ్చితంగా సంబంధం ఉంది. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

నోటిలో ఉండే బ్యాక్టీరియాను లాలాజలం అడ్డుకుంటుంది. కానీ, బ్యాక్టీరియా నుంచి ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్​లా మారి దంతాలపై ఉన్న ఎనామిల్​ని దెబ్బతీస్తుంది. తద్వారా పుచ్చిపోయి, పిప్పి పన్నుగా మారుతుంది. అది మొదటి దశలో ఉన్నప్పుడు గుర్తించి సిమెంట్​ ఫిల్లింగ్​ చేస్తే సరిపోతుంది. 

కానీ, సమస్య లోతుగా ఉంటే రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది. సమస్యను మొదట్లోనే కట్టడి చేయకపోతే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాటిలో డయాబెటిస్, క్యాన్సర్, ఇన్​ఫెర్టిలిటీ, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటివి ఉన్నాయి. కొంతమందిలో పాంక్రియాస్ సమస్యలకు కూడా కారణమవుతుంది. పై దవడలో ఏదైనా సమస్య ఉంటే అది బ్రెయిన్​కి ఎఫెక్ట్ చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది. వీటన్నింటికీ నోటిలోని చెడు బ్యాక్టీరియానే కారణం అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అలాగే కిడ్నీలు సరిగా పనిచేయని వాళ్లలో నోటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్లలో నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలోని యూరియా బయటకు వెళ్లదు. అది అమ్మోనియాగా మారి నోటి నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు దుర్వాసన ఎక్కువగా వస్తుంది. కాల్షియం తక్కువై దంతాలు వదులుగా తయారవుతాయి. నోరు కూడా తడి ఆరిపోతూ ఉంటుంది. 

ఇలా చేస్తే సరి..

  • నాలుక పింక్ కలర్​లో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి ఎప్పటికప్పుడు నాలుకను సరిగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 
  • రోజూ రెండుపూటలా బ్రష్​ చేసుకోవాలి. పొద్దున లేవగానే ఒకసారి, రాత్రి పడుకునేముందు మరోసారి పళ్లు శుభ్రం చేసుకోవాలి. 
  • రాత్రిపూట బ్రష్​ చేశాక తినకూడదు. నీళ్లు తప్ప ఏమీ తాగకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా రాత్రిపూటే ఎక్కువ డెవలప్​ అవుతుంది. 
  • చిగుళ్లు గట్టిగా గులాబీ రంగులో ఉండాలి. దంతాలపై పాచి, గార లేకుండా తెల్లగా ఉండాలి. 
  • మూడు నెలలకు ఒకసారి టూత్​ బ్రష్​ మార్చాలి. 
  • షుగర్స్, కార్బోహైడ్రేట్స్​ పదార్థాలు మిగిలిపోతే బ్యాక్టీరియా అటాక్ చేసి పళ్ల మీద ఉన్న ఎనామిల్​ పొరను డ్యామేజ్ చేస్తుంది. 
  • మద్యం, పొగ, జంక్​ ఫుడ్​ వంటివి తినడం వల్ల నోటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. 
  • మొదటి దశలో పంటి సమస్యలు బయటపడవు. పంటి నొప్పి వస్తే వెంటనే డాక్టర్​ దగ్గరకు వెళ్లాలి. 
  • ఆరునెలలకు ఒకసారి డెంటల్​ చెకప్​ చేయించుకోవాలి. దంతాలు, చిగుళ్లలో చిన్న సమస్య ఉన్నా డాక్టర్​ని సంప్రదించాలి. 

దుర్వాసనకు చెక్​!

నోటి దుర్వాసన.. చాలా కామన్​గా వచ్చే ప్రాబ్లమ్. కొంతమందికి తమ నోరు దుర్వాసన వస్తుందన్న విషయం అవతలి వాళ్లు చెప్పేవరకు తెలియదు. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంటుంది. నలుగురిలో కలవలేరు. హ్యాపీగా ఉండరు. నవ్వుతూ మాట్లాడలేరు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ముందు కారణాలేంటో తెలుసుకోవాలి.  

ముఖ్యమైనవి ఇవే..

  • దంతాలు, పళ్లు శుభ్రం చేసుకోకపోవడం, బ్రష్​ ఎలాంటిది వాడాలో? ఎలా వాడాలో అవగాహన లేకపోవడం.
  • అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి ఆహార పదార్థాలు తిన్నవాళ్లలో, రెగ్యులర్​గా మందులు వాడేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 
  • డయాబెటిస్, క్యాన్సర్, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లలో యాసిడ్ రిఫ్లక్స్ జరిగి దుర్వాసన వెలువడుతుంది. 
  • పళ్ల వరుస ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల పదార్థాలు పళ్ల మధ్యలో ఇరుక్కుంటాయి. తద్వారా కూడా దుర్వాసన వస్తుంది. 

ఇలా చేయండి

  • శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు నోటిలో సరిపడా లాలాజలం ఊరదు. దీనివల్ల కూడా దుర్వాసన వస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. 
  • గళ్ల ఉప్పును గోరు వెచ్చని నీటిలో కరిగించి పొద్దున్నే ఒకసారి ఆ నీటితో పుక్కలించాలి. ఇలా చేస్తే నోటిలోని బ్యాక్టీరియా 95 శాతం పోయి నోరు ఫ్రెష్​గా ఉంటుంది.