ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భారీ మెజార్టీ సాధిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లను ఇప్పటికే అధిగమించిన మహాయుతి కూటమి.. 200 సీట్ల మార్క్‌ను సైతం క్రాస్ చేసింది. మహా వికాస్ అఘాడీ కూటమిని చిత్తు చేస్తూ.. ప్రస్తుతం 220 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అధిక్యంలో దూసుకుపోతుంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే మహా ఫలితాలు వెలువడుతున్నాయి.
మరాఠా గడ్డపై అధికార ముహాయుతి కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. వెలువడుతోన్న ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసింది. అయితే, మహారాష్ట్రలో మహయుతి కూటమి తిరిగి అధికారం నిలుబెట్టుకోవడానికి కారణాలేంటి..? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమి ఘోర పరాభవం చవిచూడటానికి దారి తీసిన పరిస్థితులేంటి..? ముఖ్యంగా మహాయుతి కూటమి చారిత్ర్మాక విజయానికి దోహదం చేసిన అంశాలేంటి..? అంటే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయానికి ముఖ్యంగా 5 అంశాలు దోహదం చేశాయి.
1. ఉచిత పథకాల హామీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడంలో ‘ఉచితాలు’ క్రియాశీలక పాత్ర పోషించాయి. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ ఫ్రీబీస్‌పై జోరుగా క్యాంపెయినింగ్ చేసింది. ముఖ్యంగా మహయుతి కూటమి ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్, లడ్కా భావు యోజన పథకంతో పాటు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల వాగ్దానాలు మరాఠా ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్ కింద 21 నుండి 65 సంవత్సరాల మహిళలకు ప్రభుత్వం నెలకు రూ.1500 ఆర్థిక సహయం అందజేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాఝీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్ కింద రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలు నేర్పించడంతో పాటు.. ఉద్యోగ అవకాశాలతో సన్నద్ధం చేయడం కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రెండు ఈ పథకాల్లో మహయుతి గెలపులో కీ రోల్ పోషించాయి.
2. కుల సమీకరణాలు
లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముస్లింలు ఓటర్లంతా పెద్ద ఎత్తున మహా వికాస్ అఘాడీ కూటమికి జై కొట్టారు. మరాఠా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంప్రదాయ ఓటర్లు అయిన ఓబీసీలు కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగలింది. లోక్ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న బీజేపీ మరాఠాలు, ఓబీసీలకు దగ్గర అయ్యాయి. శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా రెండుగా చీలడం కూడా మహాయుతి కూటమికి కలిసి వచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి దూరంగా ఉన్న ఓబీసీలు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓట్లు గుద్దడంతో మహయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పాటుగా రైతులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఎన్నికలకు ముందు అధికార కూటమి తీసుకొచ్చిన పథకాలు సైతం ఎన్డీఏ కూటమి విజయంలో పాత్ర పోషించాయి.
3. నినాదాలు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముఖ్యంగా నినాదాలే చుట్టే తిరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండియా కూటమి కులగణన డిమాండ్ వ్యతిరేకంగా.. ప్రధాని మోడీ.. 'ఏక్ హై తో సేఫ్ హై’ అనే నినాదంతో ప్రచారం హోరెత్తించగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన "బాటేంగే టు కటేంగే" స్లోగన్ మహా పాలిటిక్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. కలిసి ఉంటునే జాగ్రత్త ఉంటామని మోడీ ఓటర్లకు వివరించగా.. కులాల పేరుతో విడిపోతే హిందువుల కింద పడిపోతామని సీఎం యోగి ఆదిథ్య నాథ్ జోరుగా ప్రచారం చేశారు.
యోగి బాటేంగే టు కటేంగా నినాదాన్ని ఆర్ఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకుపోవడంతో మహయుతి కూటమి విజయానికి మార్గం మరింత సుగమమం అయ్యింది. యోగి కటేంగే టు బటేంగ్ నినాదంపై మహయుతి కూటమిలో విభేదాలు వచ్చినప్పటికీ బీజేపీ నేతల వెనక్కి తగ్గకపోవడం హిందువులను మరింత ఏకం చేసింది. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో "బాటేంగే టు కటేంగే" ఈ వ్యూహం బాగా వర్కౌట్ అయ్యింది.
4. విదర్భ
మహారాష్ట్రంలో ఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విదర్భలో మెజార్టీ సీట్లు గెలవడం ముఖ్యం. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెల్చుకున్న పార్టీనే దాదాపు మరాఠా గడ్డపై గవర్నమెంట్ ఫామ్ చేస్తోంది. అయితే, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదర్భలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. 10 పార్లమెంట్ స్థానాలకు గానూ కేవలం మూడు చోట్లనే విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మేలుకున్న మహాయుతి కూటమి విదర్భపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
విదర్భలో తిరిగి పట్టు చేజిక్కించుకోవడం కోసం ఏ అవకాశాన్ని ఎన్డీఏ వదులుకోలేదు. బెంగాల్, హర్యానాలో బీజేపీ సక్సెస్ కావడంలో కీ రోల్ పోషించిన వ్యూహకర్త కైలాష్ విజయవర్గియాను మహయుతి కూటమి విదర్భలో దించింది. అతను 100 మంది సభ్యుల బృందంతో రెండు నెలల పాటు విదర్భలో మకాం వేసి బీజేపీ పుంజుకునేలా చేశాడు. ఆర్ఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి విదర్భలో మహయుతి కూటమి స్ట్రాంగ్ అయ్యేలా చేశాడు. దీంతో విదర్భలో ఈ సారి మహయుతి కూటమికి సంచలనాలు ఫలితాలు నమోదు చేసింది.
5. పోల్ మేనేజ్మెంట్
మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల యంత్రాంగం బాగా పనిచేసింది. మహా వికాస్ అఘాడీ కూటమి నేతల కంటే ఎక్కువగా.. మహయుతి టాప్ లీడర్స్ ప్రచారం హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోడీ 106 అసెంబ్లీ నియోజకవర్గాలను 10 ర్యాలీల్లో కవర్ చేయగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 16 ర్యాలీల ద్వారా 38 సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. యోగి ఆదిత్య నాథ్ సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో కటేంగ్ తో బటేంగే అంటూ ప్రచారాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకుపోయారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రికార్డ్ స్థాయిలో 75 ర్యాలీల్లో ప్రసంగించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 72 ర్యాలీలు మరియు రోడ్‌షోల్లో పాల్గొన్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 55 ర్యాలీలలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే 7, 9 ర్యాలీలకు మాత్రమే పరిమితమయ్యారు. పోల్ మేనేజ్మెంట్ సైతం మహయుతి కూటమి సీరియస్ తీసుకుని పని చేసింది. ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని బూత్ లోని ప్రతి ఓటర్ ను నేతలు కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం వరకు ఓట్లు వేయని ఓటర్లను కలిసి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ ఐదు కారణాలు మహారాష్ట్రలో మహయుతి కూటమి విజయానిక దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.