ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు

  • అంచనాలకు దగ్గరగానే ఐదు రాష్ట్రాల ఫలితాలు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. నంబర్లు కాస్త అటూఇటూ అయినా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయం సాధిస్తుందని, పంజాబ్​లో ఆప్​ గెలుస్తుందన్న ఎగ్జిట్​ పోల్​ అంచనాలు తప్పలేదు. మిగతా 3 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఏబీపీ న్యూస్–సీవోటర్, ఈటీజీ రీసెర్చ్, ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, జీ న్యూస్–డిజైన్ బాక్స్డ్, ఇండియా న్యూస్, న్యూస్ 24–టుడేస్ చాణక్య, రిపబ్లిక్–పీమార్క్ ఎగ్జిట్​ పోల్స్ యూపీలో బీజేపీ 240కిపైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. సమాజ్​ వాదీ పార్టీకి 142 సీట్లు వస్తాయన్నాయి. ఫలితాల్లో బీజేపీకి 273 సీట్లు, ఎస్పీకి 125 సీట్లు వచ్చాయి.
అంచనాలకు తగ్గట్టుగానే..
పంజాబ్​లోనూ ఎగ్జిట్​ పోల్స్ దాదాపు కరెక్ట్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ(ఆప్) పార్టీ పంజాబ్​లో దూసుకెళ్తదని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆప్​కు 63 సీట్లు, కాంగ్రెస్​కు 28 సీట్లు రావొచ్చని అంచనా వేశాయి. గురువారం నాటి ఫలితాల్లో ఆప్​ 92, కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్​లో మాత్రం ఎగ్జిట్​ పోల్స్ ట్రాక్ తప్పినట్టుగా కనిపించింది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్​ ఉంటుందని బీజేపీ గెలవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యతను సాధించింది. 70 సీట్లున్న ఉత్తరాఖండ్​ అసెంబ్లీలో బీజేపీ 47, కాంగ్రెస్ 19 సీట్లు  సాధించాయి. గోవాలో హంగ్ అసెంబ్లీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 40 సీట్లు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 20 సీట్లు వచ్చాయి. మణిపూర్ లో బీజేపీదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. 60 సీట్లున్న 32 సీట్లు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది.