- ఫ్యామిలీ మెంబర్ల అకౌంట్ల నుంచి అప్లయ్ చేయొచ్చు
- ఒకే పాన్‌కార్డ్‌తో ఉన్న వేరు వేరు డీమాట్ అకౌంట్ల నుంచి వద్దు
- మైనర్ అకౌంట్‌తోనూ అప్లికేషన్
న్యూఢిల్లీ : ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ట్రేడింగ్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఐపీఓలకు అప్లయ్ చేస్తున్నారు. షేర్లు అలాట్ అయితే లిస్టింగ్ రోజే అమ్మేసి మంచి లాభాలు గడిస్తున్నారు. కొంత మంది లిస్టింగ్ రోజు నుంచి వారం రోజుల పాటు హోల్డ్ చేసి, ఆ తర్వాత ఎగ్జిట్ అవుతున్నారు. చాలా ఐపీఓలు లిస్టింగ్ రోజు 50 శాతం నుంచి 140 శాతం వరకు రిటర్న్ ఇవ్వడమే కారణం. తాజాగా మార్కెట్లో లిస్టింగ్ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు మొదటి రోజే 135 శాతం పెరిగాయి.
మరికొంత మంది ఇన్వెస్టర్లు ఐపీఓలో తక్కువ ధరకు దొరికే షేర్లను లాంగ్ టెర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. కానీ, ఐపీఓలకు అప్లయ్ చేసే ఇన్వెస్టర్లందరికీ షేర్లు అలాట్ కావడం లేదు. చాలా ఎస్ఎంఈ, మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఓవర్ సబ్స్క్రయిబ్ అవుతున్నాయి. ఒక పబ్లిక్ ఇష్యూ ఓవర్ సబ్స్క్రయిబ్ అయితే షేర్లు అలాట్ అయ్యే చాన్స్ తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి. షేర్ల అలాట్మెంట్ కూడా నిజాయతీగా జరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. అందువలన అలాట్మెంట్ చాన్స్ పెరగాలంటే ఈ కింద అంశాలను జాగ్రత్తగా ఫాలో కావాలి.
1. అప్లికేషన్లు పెంచాలి..
ఐపీఓ అలాట్మెంట్ చాన్స్ పెరగాలంటే కొన్ని గైడ్‌లైన్స్ ఫాలో కావాలని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు ఎక్కువగా అప్లికేషన్లు పెట్టుకోవాలి. అంటే ఇంటిలో ఉండే పెద్దవారి డీమాట్ అకౌంట్ల నుంచి కూడా ఐపీఓకి అప్లయ్ చేసుకోవాలి. అప్లికేషన్ సైజ్ పెద్దగా ఉండకూడదని, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లతో అప్లయ్ చేసుకోవాలని, వేరు వేరు డీమాట్ అకౌంట్ల నుంచి అప్లయ్ చేయకూడదని ఏంజెల్ వన్ ఎనలిస్ట్ వివరించారు.
2. మైనర్ పేరుతో అప్లికేషన్..
మైనర్ పేరు మీద డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఐపీఓకి అప్లయ్ చేయొచ్చు. డీమాట్ , బ్యాంక్ అకౌంట్..రెండూ మైనర్ పేరు మీద ఉండాలి. అలానే మైనర్ కూడా 15 ఏళ్లు దాటి ఉండాలి. వీరు నెట్‌బ్యాంకింగ్, యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడానికి అర్హులు. యూపీఐ ఐడీ ద్వారా రూ.5 లక్షల వరకు ఐపీఓ షేర్ల కోసం మైనర్ అప్లయ్ చేసుకోవచ్చు. షేర్ల అలాట్మెంట్ పేమెంట్ విధానంపై ఆధారపడి ఉండదని గుర్తుంచుకోవాలి.
3. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (హెచ్‌యూఎఫ్) ..
వీలు కుదిరితే ఇన్వెస్టర్లు హెచ్‌యూఎఫ్ కోసం సపరేట్గా డీమాట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, ఐపీఓకి అప్లయ్ చేసుకోవచ్చు. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (ఆర్ఐఐ), నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ– హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐ) వంటి కేటగిరీల కింద హెచ్‌యూఎఫ్ ఐపీఓకి అప్లయ్ చేసుకోవడానికి వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో స్పెషల్ కేటగిరీల్లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
4. ఒకేసారి రెండు కేటగిరీల్లో వద్దు..
పాన్ కార్డ్ నెంబర్ బట్టి ఐపీఓ అప్లికేషన్ ఒకటే ఉందా? లేదా? అనేది ఐపీఓ రిజిస్ట్రార్ చెక్ చేస్తారు. రిటైల్, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐ) కేటగిరీల కోసం మాత్రమే ఇలా చెక్ చేస్తారు. షేర్‌హోల్డర్ లేదా ఎంప్లాయీ కోటాలో చెక్ చేయరు. అందువలన ఇన్వెస్టర్ రిటైల్ లేదా హెచ్ఎన్ఐ, షేర్‌హోల్డర్ లేదా ఎంప్లాయీ కోటా ఏవో రెండింటిలో అప్లయ్ చేసుకోవచ్చు. కానీ, రిటైల్, హెచ్ఎన్ఐ కోటా రెండింటిలో అప్లయ్ చేసుకోకూడదు. ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఒక ఐపీఓ కోసం ఐదు అప్లికేషన్ల వరకు పెట్టుకోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఇన్వెస్టర్ తన పాన్‌కార్డ్ కింద రిటైల్ కోటా, హెచ్‌యూఎఫ్ పాన్నెంబర్తో రిటైల్ లేదా హెచ్ఎన్ఐ కోటా కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. టెక్నికల్‌గా చూస్తే ఒక ఇండివిడ్యువల్ రిటైల్ లేదా హెచ్ఎన్ఐ (1) , ఎంప్లాయీ (2) , షేర్‌హోల్డర్ (3) , హెచ్‌యూఎఫ్ రిటైల్ లేదా హెచ్ఎన్ఐ (4) , హెచ్‌యూఎఫ్ షేర్‌హోల్డర్ (5) కేటగిరీల్లో ఐపీఓకి అప్లయ్ చేసుకునే వీలుంది. కాగా, రూ.2 లక్షల లోపు విలువుండే షేర్ల కోసం అప్లయ్ చేసుకునే వారిని రిటైల్ ఇన్వెస్టర్లుగా పిలుస్తారు.
5. మరికొన్ని ..
అలాట్మెంట్ చాన్స్ పెరగాలంటే ఐపీఓకి వీలున్నంత తొందరగా అప్లయ్ చేసుకోవాలి. అప్లికేషన్ రిజెక్ట్ కాకూడదంటే డీపీ ఐడీ, పాన్ కార్డ్, యూపీఐ ఐడీ వంటి వివరాలను కరెక్ట్‌గా నింపాలి. హయ్యర్ బ్యాండ్ ధర వద్ద అప్లికేషన్ పెట్టుకోవడం మంచిది.