![ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు5 వేల కోట్లు](https://static.v6velugu.com/uploads/2023/01/5-thousand-crores_gHWEatwqlS.jpg)
- మూడేండ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కార్
- విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలు
- 18 లక్షల మంది స్టూడెంట్ల ఎదురుచూపులు
- ఫీజులు పూర్తిగా కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ బెదిరింపులు
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను రాష్ట్ర సర్కార్ చెల్లించడం లేదు. అకడమిక్ ఇయర్ పూర్తయ్యేలోగా చెల్లించాల్సిన ఫీజులను రెండు మూడేండ్లయినా ఇవ్వడం లేదు. దీంతో ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే రెండేండ్ల బకాయిలు రూ.2,900 కోట్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మొత్తం మూడేండ్ల బకాయిలు కలిపి రూ.5 వేల కోట్లు దాటాయి. దాదాపు 18 లక్షల మంది స్టూడెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. లేదంటే నెక్ట్స్ అకడమిక్ ఇయర్ కు రానివ్వబోమని బెదిరిస్తున్నాయి. ఇక చదువు పూర్తయినోళ్లు సర్టిఫికెట్ల కోసం కాలేజీలకు పోతే ఫీజులు కడితేనే ఇస్తామంటున్నాయి. ముందు స్టూడెంట్లు డబ్బులు కట్టాలని, సర్కార్ చెల్లించిన తర్వాత అవి తిరిగి ఇస్తామని చెబుతున్నాయి.
ప్రతిసారీ ఎదురుచూపులే..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ కోసం స్టూడెంట్లు ప్రతిఏటా ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడూ సకాలంలో చెల్లించడం లేదు. డిగ్రీ ఫస్ట్ఇయర్ ఫీజులను ఫైనల్ ఇయర్ లో ఇస్తోంది. దీంతో సెకండ్, థర్డ్ ఇయర్ ఫీజులను స్టూడెంట్ల నుంచే మేనేజ్ మెంట్లు వసూలు చేస్తున్నాయి. ఇక కోర్సులు పూర్తయిన స్టూడెంట్లు డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో పైచదువులకు వెళ్లడానికి స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పేరెంట్స్ బయట అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోందని, సర్కార్ వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇక డబ్బులు కట్టే స్తోమత లేని స్టూడెంట్లు.. సర్టిఫికెట్లు కాలేజీల్లోనే వదిలేసి చదువు మానేస్తున్నారు. కాగా, ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ లకు శాంక్షన్డ్ ఆర్డర్స్ ఇవ్వడం.. దానికి అనుగుణంగా ఫైనాన్స్నుంచి బీఆర్వోలు ఇవ్వడం మాత్రమే జరుగుతోంది. టోకెన్లు జారీ చేస్తున్నా అకౌంట్లలో మాత్రం డబ్బులు వేయడం లేదు. అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖ, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో బకాయిలు ఎక్కువగా ఉన్నాయి.
రూల్స్ పాటిస్తలే..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ చెల్లింపుల కోసం పెట్టుకున్న రూల్స్ ను ప్రభుత్వమే పాటించడం లేదు. స్టూడెంట్ అప్లికేషన్ అప్రూవ్అయిన వెంటనే మొత్తం రీయింబర్స్‌మెంట్‌లో 25 శాతం చెల్లించాలి. తర్వాత అకడమిక్ ఇయర్ మధ్యలో 50 శాతం, మిగిలిన మొత్తం అకడమిక్ ఇయర్ ముగిసేలోగా చెల్లించాలి. కానీ ప్రభుత్వం చెల్లింపులకు రెండేండ్లకు పైగా టైమ్ తీసుకుంటోంది. ఫస్టియర్ వి ఫైనలియర్ లో ఇస్తోంది. కాగా, ఏటా యావరేజ్‌గా 11 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్లకు స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్‌గా ఏటా రూ.2,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఇయర్వి ఫైనలియర్లో ఇచ్చిన్రు
సిటీలోని ఓ ప్రైవేట్‌కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. ఫస్టియర్ ఫీజు రీయింబర్స్మెంట్ఈ మధ్యనే వచ్చింది. సెకండ్, థర్డ్ఇయర్వి ఇంకా రాలేదు. సర్టిఫికెట్ల టైమ్ వరకు ప్రభుత్వం చెల్లించకపోతే మేమే కట్టుకోవాలని కాలేజీ వాళ్లు చెప్పారు. గవర్నమెంట్ నుంచి బకాయిలు వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. మా సీనియర్లతో అలాగే డబ్బులు కట్టించుకొని, సర్టిఫికెట్లు ఇచ్చారు.
- మహేందర్, బీఎస్సీ థర్డ్ ఇయర్
ప్రభుత్వం స్టూడెంట్లను చదువుకు దూరం చేస్తున్నది
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం లక్షల మంది స్టూడెంట్లను చదువుకు దూరం చేస్తోంది. ఏటా బకాయిలు పేరుకుపోతున్నాయే తప్ప, క్లియర్ చేయడం లేదు. ప్రభుత్వానికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు మీద లేదు. రాష్ట్రం వస్తే విద్య, వైద్య రంగాలను జాతీయం చేస్తామని గొప్పలు చెప్పిన్రు. కానీ ఇప్పుడేం చేస్తున్నరు.
- జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు