- ఇస్రో లక్ష్యాల్లో స్పెషల్ మిషన్స్
- సూర్యుడు, భూమి, శుక్రుడు, ఎక్స్ కిరణాలపై ప్రయోగాలు
- అన్నీ 2025లో పూర్తి
వచ్చే ఐదేళ్లు భారత అంతరిక్షరంగానికి ఆయువు పట్టు కానున్నాయి. ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపే మిషన్ కాకుండా మరో ఐదు ప్రత్యేకమైన మిషన్స్ కోసం మన ఇస్రో సర్వసన్నద్ధమవుతోంది. ఈ మేరకు తన ప్రయారిటీలను ఇస్రో మే నెలాఖరులో రిలీజ్ చేసిన వార్షిక రిపోర్టుల్లో పేర్కొంది. చంద్రయాన్‌కు కొనసాగింపు ప్రయోగం, చంద్రయాన్ 2ను కూడా 2025 కంటే ముందే ఇస్రో పూర్తి చేయనుంది.
రాడార్ ఇమేజ్ శాటిలైట్
ఇదో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఓ శాటిలైట్ కు ఈ వ్యవస్థను అమర్చడం ఇదే తొలిసారి. నాసా–ఇస్రో కలిసి దీన్ని తయారు చేస్తున్నాయి. అందుకే దీనికి నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిసార్)గా పేరు పెట్టారు. దీనికి కోసం చరిత్రలో ఏ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కు పెట్టనంత ఖర్చు చేస్తున్నారు. దీని అంచనా వ్యయం దాదాపు 10.35 వేల కోట్ల రూపాయలు. 2021లో జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా సన్ సింక్రనస్ ఆర్బిట్(ఎస్ఎస్ఓ) లోకి దీన్ని ప్రయోగించనున్నారు. నిసార్ పూర్తిగా సోలార్ పవర్ తో పని చేస్తుంది. దీన్ని ఎస్ఎస్ఓలోకి ప్రవేశపెట్టడానికి కారణమిదే. భూమి పైపొర, ధ్రువాల్లోని మంచు, వాతావరణ మార్పులు, బయోమాస్ తదితరాలపై డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ టెక్నాలజీతో పరిశోధనలకు ఈ శాటిలైట్ ను వాడతారు. వారానికి రెండు సార్లు భూమిని చుట్టే ఈ శాటిలైట్ చాలా స్పష్టమైన ఫొటోలను ఇది తీయగలదు. విపత్తుల సమయంలో కూడా దీని సేవలు వాడుకోవచ్చు. ఈ శాటిలైట్ సేకరించే డేటాను నాసా–ఇస్రో ప్రజలకు అందుబాటులో ఉంచుతాయి.
సొంతంగా స్పేడెక్స్
నింగిలో సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్లాన్స్ గీస్తున్నట్లు ఇస్రో ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇంటర్నల్ ప్రాజెక్టుకు ఇప్పటికే పది కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. అదే ‘స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్’(స్పేడెక్స్). రెండు అంతరిక్ష నౌకలను ఒకదాన్ని మరొకదానితో కలపడమే ఈ మిషన్. ఒకసారి రెండు నౌకలను కలిపిన తర్వాత కంట్రోల్ సిస్టమ్ తో అవసరానికి తగ్గట్టు దాన్ని అటూ ఇటూ కదపొచ్చు. సొంత స్పేస్ స్టేషన్ నెలకొల్పాలంటే ఈ టెక్నాలజీపై పట్టు సాధించడం ఇస్రోకు అత్యవసరం. ఆస్ట్రోనాట్ల రాకపోకలు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. వచ్చే ఐదేళ్లలో స్పాడెక్స్ లో ఉన్న రెండు అంతరిక్షనౌకలను విడివిడిగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో నింగిలోకి పంపనుంది.
వీనస్ ఆర్బిటార్
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో వీనస్ ఆర్బిటార్ కూడా ఒకటి. 2023లో దీన్ని ప్రయోగించనున్నారు. భూమి తర్వాత మనిషికి నీడ నిచ్చే గ్రహం కోసం వెతకాలని అనుకున్నప్పుడు తొలుత ప్రపంచం దృష్టి పడింది శుక్రుడి మీదే. కానీ వెంటనే అంగారకుడిపైకి అందరి చూపు మళ్లింది. ప్రస్తుతం జపాన్‌కు చెందిన అకాసుకీ అనే ఆర్బిటార్ మాత్రమే వీనస్‌ను శోధిస్తోంది. తాజాగా వంద కేజీల పేలోడ్‌తో వీనస్ ఆర్బిటార్‌ను పంపాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో ఇండియా సొంతంగా చేసిన 12 పరికరాలు, ఒక అంతర్జాతీయ పరికరం ఉంటాయి. శుక్రుడి నేల, వాతావరణం, అక్కడ జరిగే రసాయన చర్యలు, సోలార్ విండ్ తీవ్రతను అంచనా వేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు.
సూరన్న వైపు చూపు
ఇండియా తొలి స్పేస్ టెలీస్కోప్ ‘ఆస్ట్రోశాట్’ అతి శక్తిమంతమైన కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేయడానికి సూర్యుడికి చెంతకు వెళ్లనుంది. 2020లో పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఇస్రో ఆస్ట్రోశాట్ ను ప్రయోగించనుంది. సూర్యుడు, భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి శూన్యంగా ఉండే లాంగ్రేనియన్ పాయింట్(ఎల్1)లో ప్రవేశపెడుతుంది. ఈ మిషన్ కు ఆదిత్య–ఎల్1గా పేరు పెట్టారు. సూరన్న ఉపరితలం కరోనా, అక్కడి వాతావరణం ‘ఫొటోస్పియర్’పై ఆస్ట్రోశాట్ పరిశోధన చేస్తుంది. ఎల్1 నుంచి ఆస్ట్రోశాట్ సూర్యుడిని నిరంతరం గమనించగలదు. సూర్యుడి మాగ్నటిక్ ఫీల్డ్, సోలార్ విండ్స్ విడుదల చేస్తున్న రేడియేషన్ ను కరక్టుగా అంచనా వేయగలదు. ఎల్1 అంటే ఏదో చిన్న పాయింట్ అనుకునేరు. స్పేస్ లో అదొక చిన్న ప్రాంతం. సూర్యుడి వాతావరణంపై అధ్యయం చేసేందుకు ఇప్పటికే ఇక్కడికి చాలా శాటిలైట్స్ ను పంపారు. ఎస్ఓహెచ్ఓ, ఏసీఈ, విండ్, డీఎస్ సీఓవీఆర్ వాటిలో కొన్ని. వీటితో ఆదిత్య–ఎల్1కు పోలిక లేదు. ఆస్ట్రోశాట్ రకరకాల వేవ్ లెంగ్త్ లతో సూర్యుడిని పరిశోధిస్తుంది. దీని డేటాను, నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రొబ్ డేటాతో పోల్చి చూస్తారు. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు కొన్ని కోట్ల డిగ్రీల ఎక్కువ వేడిగా ఉందో తెలుసుకోవడమే ఆదిత్య ఎల్1 లక్ష్యం.
ఎక్స్ రే అబ్జర్వేటరీ
ఇస్రో టార్గెట్‌గా పెట్టుకున్న స్పేస్ సైన్స్ మిషన్లలో ఎక్స్ రే పొలారీమెట్రీ శాటిలైట్(ఎక్స్ పీఓశాట్) కూడా ఒకటి. 2021లో గెలుపు గుర్రం పీఎస్ఎల్వీతో ఇస్రో దీన్ని నింగిలోకి పంపనుంది. ఎక్స్ పీవోశాట్ అంతరిక్షంలో ఎక్స్ రే కిరణాలు ఎలా ప్రయాణిస్తున్నాయో అధ్యయనం చేస్తుంది. నేటి వరకూ అంతరిక్షంలో ఎక్స్ రే కిరణాల ప్రయాణంపై అధ్యయనం చేస్తున్న ఒకే ఒక్క శాటిలైట్ క్రాబ్ నెబ్యులా. ఎక్స్ పీఓశాట్ ద్వారా విశ్వంలోని అతి కాంతిమంతమైన 50 ప్రదేశాల్లో ఎక్స్ రే కిరణాల ప్రయాణాన్ని తెలుసుకోవాలని ఇస్రో భావిస్తోంది. దీనిలోని 8–30కేఈవీ అనే పోలారీమీటర్ పరికరం ఓ మీడియం ఎక్స్ రే రీజియన్ పని చేస్తుంది. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో దాన్ని తయారు చేస్తున్నారు.
ఇస్రో న్యూ స్పేస్ ఇండియా
ఇస్రో‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్) పేరుతో కొత్త పబ్లిక్ సెక్టార్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇది ఇస్రో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ను పూర్తి స్థాయిలో వాడుకోనుంది. ఇది పీఎస్ఎల్వీ, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)రాకెట్లను తయారు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. చిన్న శాటిలైట్ల టెక్నాలజీలను ట్రాన్స్ ఫర్ చేయడం ఎన్ఎస్ఐఎల్ విధుల్లో ఒకటని చెప్పింది. వీటితో పాటు సర్వీసుల మార్కెటింగ్ ను కూడా ఎన్ఎస్ఐఎల్ పర్యవేక్షిస్తుందని ఇస్రో పేర్కొంది. యాంట్రిక్స్ అనే కార్పొరేషన్ కూడా ఇస్రో సర్వీసులను మార్కెటింగ్ చేస్తోంది.