పండుగనాడు పొద్దున్నే ఇంటి ముందు రంగులతో రంగవల్లికలు వేస్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ రంగులకు బదులు నేచురల్ కలర్స్ వాడాలి. అందుకోసం బియ్యప్పిండి, పసుపు, బంతి పువ్వులు, గులాబీ రేకులు, చామంతి వంటివి బెటర్ ఛాయిస్. ఇక ఎకో ఫ్రెండ్లీ టపాసులు చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
మొలకెత్తే టపాసులు!
టపాసులంటే భారీ శబ్దంతో పేలి, ఆకాశంలోకి దూసుకెళ్లి వెలుగులు విరజిమ్ముతాయని తెలిసిందే. కానీ, దాని వల్ల పర్యావరణానికి, మనుషులకు హాని జరుగుతోంది. అందుకే పేలని టపాసులు తయారుచేస్తున్నారు. చూడ్డానికి అచ్చం టపాసుల్లా పర్యావరణహితంగా ఉంటాయి. కాకపోతే వీటిని కాల్చకూడదు. ఎందుకంటే అవి పేలవు కాబట్టి! వాటిలో ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే పేలుడు పదార్థాలు వాడరు. అందుకు బదులుగా పర్యావరణానికి మేలు చేసేలా.. విత్తనాలు వాడారు. విత్తనాలను టపాసుల్లా తయారు చేశారు. వాటిని మట్టిలో నాటి, రోజూ నీళ్లు పోస్తే మొలకెత్తుతాయి. ఆ మొక్కలు పెరిగి మానవాళికి ఆక్సిజన్ అందిస్తాయి.
ఈ మంచి ఆలోచనతోనే బెండ, పాలకూర, మెంతి వంటి కూరగాయలు, ఆకు కూరలకు సంబంధించిన విత్తనాలను టపాసుల్లో పెట్టి చుట్టేస్తున్నారు. వీటిని ‘సీడ్ బాల్స్’ అంటారు. మహారాష్ట్రకు చెందిన ‘గ్రామ్ ఆర్ట్ ప్రాజెక్ట్’ టపాకాయల రూపంలో సీడ్ బాల్స్ తయారు చేస్తోంది. చింద్వారా జిల్లాకు చెందిన పరద్సింగ్అనే ఊళ్లో వీటిని తయారు చేస్తున్నారు. సీడ్ బాల్స్ మాత్రమే కాదు.. రాఖీ పండుగకి సీడ్ బ్యాండ్స్ వంటి పర్యావరణహితంగా ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నారు.
గ్రీన్ క్రాకర్స్
నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) గ్రీన్ క్రాకర్స్ ఐడియాని తెరపైకి తెచ్చింది. వీటిలో బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ వంటి కాలుష్యం కలిగించే రసాయనాలు దాదాపుగా ఉండవు. ఒకవేళ ఉన్నా.. చాలా తక్కువ మోతాదులో ఉంటాయి! అందుకే వీటివల్ల అంతగా కాలుష్యం ఉండదు. మామూలు టపాసుల కంటే వీటి వల్ల కాలుష్యం దాదాపు 30 శాతం తక్కువ. అంతేకాదు, శబ్ద కాలుష్యం కూడా తక్కువే. అదే మామూలు టపాసులు160 డెసిబల్స్ శబ్దం చేస్తే వీటితో వచ్చే సౌండ్120 డెసిబల్స్‌కి మించదు.
ఇలా గుర్తించొచ్చు
టపాసుల ప్యాకెట్ల మీద, ఆకుపచ్చ రంగులో ‘గ్రీన్ ఫైర్ వర్క్స్’ (green fire works) అని రాసి ఉంటుంది. ఇవి120 డెసిబల్స్ కంటే తక్కువ శబ్దాన్ని కలిగిస్తాయి.. అలానే ఈ బాణాసంచా ప్యాకెట్ల మీద లోపల ఏయే రసాయనాలు వాడారనే వివరాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా NEERI లోగో కూడా కనిపిస్తుంది.