మంకీ పాక్స్ కలకలం.. ఐదేళ్ల పాపకు లక్షణాలు ? !

ఉత్తరప్రదేశ్లో ‘మంకీ పాక్స్’ కలకలం రేపుతోంది. మొట్టమొదటి మంకీ పాక్స్ అనుమానిత కేసు శనివారం గజియాబాద్ లో బయటపడింది. ఓ ఐదేళ్ల బాలికలో మంకీ పాక్స్ లక్షణాలను వైద్యులు  గుర్తించారు. శరీరంపై దద్దుర్లు, దురదతో బాధపడుతున్న బాలికను గజియాబాద్  చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షించి, అది మంకీ పాక్స్ అయి ఉండొచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చింది. వెంటనే బాలిక నుంచి శాంపిళ్లను సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. ఆ బాలికకు ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఆమె సంబంధీకులు ఎవరూ గత నెల రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లి రాలేదన్నారు. ఇప్పటిదాకా మనదేశంలో ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ దాని వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అప్రమ్తతం చేసింది. మంకీపాక్స్ లక్షణాలు ఉండే అనుమానిత కేసులపై జిల్లాల్లోని సర్వైలెన్స్ యూనిట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఒక్క అనుమానిత కేసు బయటపడ్డా  ఔట్ బ్రేక్ గా ప్రకటించి.. వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని నిర్దేశించింది. ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో 550కిపైగా మంకీ పాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులు బయటపడిన దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. కాగా, మంకీ పాక్స్ వైరస్ సోకిన వారిలో మొదట ఫ్లూ తరహా లక్షణాలు బయటపడతాయి. తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. 

మరిన్ని వార్తలు..

కాఫీ ఆర్డర్ చేస్తే... చికెన్ ముక్క వచ్చింది

మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు