బెంగళూరు సిటీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఓ కేక్ తిన్న ఐదేళ్ల చిన్నారి చనిపోతే.. వారి తల్లిదండ్రులు ఇప్పుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. ఆ కేక్ తనటం వల్లే ఇలా జరిగిందా.. అసలు ఆ కేక్ ఆర్డర్ చేసింది ఎవరు.. ఎందుకు క్యాన్సిల్ చేశారు.. దీని వెనక ఉన్న కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
42 ఏళ్ల బాలరాజ్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడు.. 35 ఏళ్ల నాగలక్ష్మి గృహిణిగా ఉన్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ధీరజ్ ఉన్నాడు. 2024, అక్టోబర్ 7వ తేదీ ఆన్ లైన్ ద్వారా ఓ కేక్ ఆర్డర్ వచ్చింది. డెలివరీ కోసం కేక్ ను తీసుకున్న తర్వాత.. ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఆ కేక్ ను ఇంటికి తీసుకొచ్చాడు డెలివరీ ఏజెంట్ బాలరాజు. ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి ఓ కేక్ తిన్నారు. ఆ తర్వాత ఇంట్లో భోజనం చేశారు. కడుపు నొప్పి వచ్చింది. మామూలుగానే అనుకున్నారు. రాత్రి సమయానికి కడుపు నొప్పి తీవ్రం కావటంతోపాటు వాంతులు కావటం ప్రారంభం అయ్యింది. విషయం సీరియస్ కావటంతో.. సమీపంలోనే బంధువులు.. ముగ్గురిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల కుమారుడు ధీరజ్ చనిపోయాడు. పేరంట్స్ బాలరాజు, నాగలక్ష్మి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కేక్ తిన్న తర్వాతే కడుపు నొప్పి ప్రారంభం అయ్యిందని.. బాలరాజ్ తో మాట్లాడిన తర్వాత బాలుడి అమ్ముమ్మ చాముండేశ్విరి మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రొట్టెలు, పాపడ్ కూడా తీసుకున్నారని.. వీటిని సమీపంలోని ఓ షాపులో కొనుగోలు చేసినట్లు చెబుతున్నది ఆమె.
కేక్ తినటం వల్లే మొదటగా కడుపు నొప్పి మొదలైందని చెప్పటంతో.. ఇప్పుడు ఆ కేక్ చుట్టూ పెద్ద రాద్దాంతం నడుస్తుంది. ఆ కేక్ తయారు చేసిన షాపు వివరాలు, ఆర్డర్ చేసిన వ్యక్తి వివరాలు అన్నింటిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. బాలుడికి పోస్టుమార్టం తర్వాతే అసలు విషయం తెలుస్తుందని.. ఇది ఫుడ్ పాయిజన్ అయ్యిందా.. అయితే అది కేక్ వల్లే జరిగిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలుస్తుందని చెబుతున్నారు డాక్టర్లు, పోలీసులు.
బెంగళూరు సిటీలో మాత్రం ఇప్పుడు కేక్ తినటం వల్లే ఐదేళ్ల బాలుడి మరణం జరిగిందనే వార్తలు సంచలనంగా మారింది. ఇటీవలే బెంగళూరు కేంద్రంగానే.. కేకుల తయారీలో క్యాన్సర్ కారక రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై కంప్లయింట్ వచ్చిందని. కేసు నమోదు చేయలేదని.. విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని వివరించారు పోలీసులు.