ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో చిన్నారి మృతి

ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో చిన్నారి మృతి
  • అడ్మిషన్‌‌ బిల్లు కట్టే వరకు డాక్టర్లు పట్టించుకోలేదని కుటుంబ సభ్యుల ఆందోళన

ఎల్బీనగర్, వెలుగు : ఐదేండ్ల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌‌లోని ఓ హాస్పిటల్‌‌కు తీసుకొచ్చారు. హాస్పిటల్‌‌లో చేరగానే చనిపోయింది. అయితే ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో అడ్మిషన్‌‌ ఫీజు చెల్లించే వరకు డాక్టర్లు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, ఆందోళనకు దిగారు. నల్గొండ పట్టణంలోని పానగల్‌‌కు చెందిన చింత అజయ్‌‌కుమార్‌‌ కుమార్తె అధిర (5) అనారోగ్యానికి గురికావడంతో స్థానిక హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు.

పరీక్షించిన డాక్టర్లు హైదరాబాద్‌‌ కొత్తపేటలోని పారమిత చిల్డ్రన్స్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాలని సూచించడంతో చిన్నారిని తీసుకొని హాస్పిటల్‌‌కు వచ్చారు. ఇక్కడ చిన్నారిని చూసిన డాక్టర్లు అడ్మిషన్‌‌ తీసుకొని, ఐసీయూలో చేర్చాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత అధిర చనిపోయింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

చిన్నారిని హాస్పిటల్‌‌కు తీసుకొచ్చిన తర్వాత 45 నిమిషాల వరకు ఎవరూ పట్టించుకోలేదని, అడ్మిషన్‌‌ ఫీజు రూ.35 వేలు కట్టిన తర్వాతే డాక్టర్లు వచ్చారని అధిర తండ్రి అజయ్‌‌కుమార్‌‌ ఆరోపించారు. ఫీజు కట్టిన రిసిప్ట్‌‌లు చూసిన తర్వాతడాక్టర్లు వచ్చారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌‌ వద్దకు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడారు.

ఆస్పత్రి యాజమన్యంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ డీఎంహెచ్‌‌వో గీత, వైద్యాధికారి వెంకటరమణ, సరూర్‌‌నగర్‌‌ పీహెచ్‌‌సీ డాక్టర్‌‌ అర్చన పారమిత హాస్పిటల్‌‌కు వచ్చి విచారణ చేశారు. చిన్నారి తండ్రి అజయ్‌‌కుమార్‌‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం రిపోర్ట్‌‌ ఇస్తామని చెప్పారు.