హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి 8 ఏండ్లలో పీఎం ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద రూరల్ లో 50,959 ఇండ్లు, అర్బన్ లో 1,58,584 ఇండ్లు సాంక్షన్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆప్ నేత ఇందిరా శోభన్ ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం బుధవారం సమాధానం ఇచ్చింది. ఎనిమిది ఏండ్లలో పీఎం అవాస్ యోజన కింద రెండు విడతల్లో రూ.1311.50 కోట్ల నిధులు సాంక్షన్ అయ్యాయని తెలిపింది.
కిందటేడాది వరకు రాష్ట్రం నుంచి 1,58,584 మంది లబ్ధిదారుల పేర్లను కేంద్రానికి పంపినట్లు వెల్లడించింది. ఇంటి స్థలం ఉన్నోళ్లకు ఆర్థిక సాయం చేసే స్కీమ్ విధి విధానాలు ప్రతిపాదన దశలో ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. ఇల్లు కట్టిస్తామని ఆశపెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలపుడు ఓట్లు దండుకున్నారని అన్నారు. ఓట్ల కోసం పేదలను మోసం చేసింది చాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాగా ఉన్నోళ్లకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు.