భైంసా, వెలుగు: నిర్మల్జిల్లాలో భారీ వర్షాలతో భైంసా మండలం సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువులు తెగిపోయి పంటలు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 150 మంది రైతులకు చెందిన దాదాపు 350 ఎకరాలకు పైగా పంటలు పాడైపోయాయి. కాగా ఇలేగాం గ్రామ శివారులోని దెబ్బతిన్న పంటలను శనివారం ముథోల్ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించేందుకు వచ్చారు. అక్కడే ఉన్న మహిళలతోపాటు పలువురు రైతులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాళ్లపై పడి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి పంటలు వేస్తే వరదలతో నాశనమయ్యాయని, తమ బతుకులు రోడ్డున పడ్డాయని కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయాన్నే నమ్ముకొని కుటుంబాలను సాకుతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.