హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరిందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 50 కోట్ల మంది జర్నీ చేశారని, ఆరున్నరేండ్ల మెట్రో చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. డెయిలీ సగటున 5 లక్షల మందికి పైన జర్నీ చేస్తున్నారని, సురక్షితమైన ప్రయాణానికి, పెరుగుతున్న విశ్వసనీయతకు 50 కోట్లు అనే నంబర్చిహ్నమన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం గర్వంగా ఉందన్నారు.
మెట్రో రైలుతో 14 కోట్ల 50లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రయాణికులను ప్రోత్సహించడానికి అమీర్పేట స్టేషన్లో గ్రీన్ మైల్స్లాయల్టీ క్లబ్ ప్రోగ్రాంను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ క్లబ్ ద్వారా ప్రయాణికులు నిర్దేశించిన ట్రిప్పులు పూర్తిచేసి ఫ్రీ గిఫ్టులు, ఎక్స్ ట్రా ట్రిప్పులు, మర్చండైజ్ పొందవచ్చని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెట్రో రెండో దశ డీపీఆర్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుందని వెల్లడించారు.